దివీస్ భూ సేకరణకు నిరసనగా 6న బహిరంగ సభ
-
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు
-
తొండంగిలో అరెస్ట్ చేసి అన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు
అన్నవరం:
దివీస్ పరిశ్రమ ఏర్పాటు కోసం బలవంతంగా భూసేకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ ఆరో తేదీన తొండంగి మండలం పంపాదిపేట లో రైతులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను పరామర్శించేందుకు మంగళవారం రాత్రి తొండంగి మండలం పంపాది పేట వెళ్లిన మధును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
బుధవారం ఆయనను తొండంగి నుంచి అన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలీసుల సహాయంతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వమని అన్నారు. ఆర్ధికశాఖామంత్రి యనమల రామకృష్ణుడి కనుసన్నల్లోనే భూసేకరణ జరుగుతోందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆరో తేదీన సభ నిర్వహించి తీరుతామని చెప్పారు. ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కూడా రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారన్నారు. రైతులకు మద్దతు ఇవ్వాలని ఇతర ప్రజాసంఘాల వాళ్లను, రాజకీయపార్టీలను కూడా కోరుతున్నామన్నారు.
సెజ్ భూముల్లో దివీస్ పెట్టుకోవచ్చు కదా...
సెజ్ పేరుతో రైతుల వద్ద నుంచి సేకరించిన పది వేల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉందని, దానిని ఎకరా రూ.80 లక్షలకు జీఎంఆర్ విక్రయిస్తోందని మధు గుర్తు చేశారు. ఆ భూముల్లో దివీస్ పరిశ్రమ పెట్టుకోవచ్చు కదా అని సూచించారు. పంపాదిపేట, తదితర గ్రామాల రైతుల భూములే అవసరమయ్యాయా అని ప్రశ్నించారు. సముద్ర తీరంలోని కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న 300 హేచరీలకు కూడా దివీస్ మందుల పరిశ్రమ వల్ల∙తీవ్ర నష్టం వాటిల్లుతుందని మధు అన్నారు.
ముద్రగడ, పవన్ కల్యాణ్ కూడా మద్దతివ్వాలి...
రైతుల ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా మద్దతివ్వాలని ఆయన కోరారు. సీపీఎం నేత మధు ను కలిసేందుకు పలువురు ప్రజాసంఘాల నాయకులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి. శేషు బాబ్జీ, అప్పారెడ్డి, మధు వెంట ఉన్నారు. తుని సీఐ బీ అప్పారావు , అన్నవరం ఎస్‌ఐ పార్ధసారధి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.