పరిహారమిచ్చి పనులు చేయండి
పరిహారమిచ్చి పనులు చేయండి
Published Wed, Jan 11 2017 11:00 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- సిద్దాపురం ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకున్న బాధితుడు
– ఎస్‌డీసీ, తహసీల్దార్ చొరవతో సమస్య పరిష్కారం
బాపనంతాపురం(ఆత్మకూరురూరల్): పరిహారం ఇచేంత వరకు పనులు జరగనిచ్చేది లేదని సిద్దాపురం ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన రైతులు అధికారులకు తెగేసి చెప్పారు. మండల పరిధిలోని బాపనంతాపురం వద్ద బుధవారం రైతులు తమ పొలాల్లో పంట కాల్వలు తీయడానికి వచ్చిన జేసీబీలను అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన శివప్రసాద్, ప్రమీలమ్మలకు చెందిన భూమిలో పంటకాల్వ తవ్వాల్సి ఉంది. వీరి భూమిని ప్రభుత్వం సేకరించింది. శివప్రసాద్‌కు చెందిన 1.58 ఎకరాల సేకరణ భూమిలో 58 సెంట్లకు రావాల్సిన పరిహారాన్ని(దాదాపు రూ 3.5 లక్షలు)అదే సర్వే నంబర్‌లో ఉన్న మరో రైతు శివయ్య బ్యాంకు ఖాతాలో వేశారు. జరిగిన పొరపాటును వివరిస్తూ తగు ఆధారాలతో రెండేళ్లుగా శివప్రసాద్ నంద్యాలలో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ అతనికి జరిగిన లోటును అధికారులు సరిదిద్దలేదు. దీంతో తమ పొలంలో కాల్వలు తీయడానికి వచ్చిన జేసీబీని అడ్డుకున్నాడు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి బాధితుడితో ఫోన్‌లో మాట్లాడి పరిహారం సొమ్ము ముట్టేవరకు పొలంలో పనులు చేయనీయవద్దని తాను కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే రెవెన్యూ అధికారులు పనులకు అడ్డు తగిలితే íపరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు బాధిత రైతు తెలిపాడు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యం, ఆత్మకూరు తహసీల్దార్ రాజశేఖరబాబు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సమావేశ పరచి శివప్రసాద్. సరోజమ్మలకు రావాల్సిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. శివయ్యకు రావాల్సిన మరో చెక్‌ను బాధితులకు బదలాయించేందుకు అంగీకరించారు. మిగిలిన సొమ్మును నెలలోపు బాధిత రైతులకు ఇచ్చేలా శివయ్యతో అంగీకార పత్రం రాయించి ఇచ్చారు.
Advertisement