ఆషామాషీగా తీసుకుంటే కుదరదు
- వందశాతం పరిష్కరించాలి
- ప్రజా సమస్యలపై కలెక్టర్ సత్యనారాయణ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆషామాషీగా తీసుకోకుండా సమగ్రంగా విచారణ జరిపి వందశాతం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలకు సంబంధించి 2017-18 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళికలను రెండు రోజుల్లో సమర్పించాలన్నారు. సోమవారం ఉదయం తన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అన్ని కార్యక్రమాలపై యాక‌్షన్ ప్లాన్‌లను పకడ్బందీగా రూపొందించాలన్నారు. మీ కోసం, డయల్ యువర్ కలెక్టర్, ఎస్సీ,ఎస్టీ గ్రీవెన్స్‌కు వచ్చే సమస్యలను 100 శాతం పరిష్కరించాలన్నారు. జూన్ 2నుంచి జరిగే నవనిర్మాణ దీక్షలకు ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించాలన్నారు. నీటిపారుదల, వ్యవసాయం మినహా మిగిలిన అన్ని అంశాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నామని, పక్కా ప్రణాళికలతో లక్ష్యాన్ని అందుకోవాలన్నారు. ప్రతి శాఖలోనూ బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలన్నారు. సమావేశంలో జేసీ ప్రసన్న వెంకటేష్, జేసీ-2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు