వారం రోజులే డెడ్‌లైన్
Published Mon, May 29 2017 11:41 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
- ‘మీ కోసం’ వినతులపై అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
- వచ్చే వారం నాటికి పరిష్కారించాలని ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా సమస్యలకు సంబంధించి డయల్ యువర్ కలెక్టర్, మీ కోసం కార్యక్రమాలకు అందిన వినతులపై విచారణ జరిపి వచ్చే వారం నాటికి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సమస్యలు మున్సిపాలిటీల్లో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని వచ్చే వారానికి క్లియర్ చేయకపోతే సంబంధిత అధికారులకు చార్జి మెమోలు ఇస్తామని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కర్నూలు బాలాజినగర్‌లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకరావడంతో సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆస్పరి మండలం నగరూరు అభివృద్ధికి రిలయన్ సంస్థ విడుదల చేసిన నిధులను గ్రామ సర్పంచ్ దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్తులు పిర్యాదు చేయగా విచారణ జరిపిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. బనగానపల్లి ఆయుష్ ఆసుపత్రికి మెడికల్ ఆఫీసర్ వారంలో 2 రోజులు మాత్రమే వస్తున్నారని ఆ ప్రాంతం వారు ఫోన్ చేయగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జేసీ-2 రామస్వామిని ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ ప్రసన్న వెంకటేష్, జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఒ గంగాధర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement