నెలాఖరులోగా పల్స్ పూర్తిచేయాలి
మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించేందుకు ప్రత్యేకాధికారులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ బాబు.ఎ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం మీ కోసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబరు నాటికి 530 గ్రామాలను ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించగా, లక్ష్యసాధనకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల పల్స్ సర్వేను నెలాఖరులోగా కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. విజయవాడ నగరంలో ఇప్పటికి 5 లక్షల కుటుంబాలకు సర్వే పూర్తి చేయటం జరిగిందని, ఇంకా 9 లక్షల కుటుంబాలు మిగిలి ఉన్నాయని చెప్పారు. ఎన్యుమరేటర్లుగా నియమించిన సిబ్బందిని ఆయా శాఖలు వెంటనే రిలీవ్ చేయాలన్నారు. ఈ–ఆఫీస్‌ను అన్నిశాఖల్లో అమలుపరచాలని కోరారు.
మండలాలకూ వీడియో కాన్ఫరెన్స్
అర్జీల పరిష్కారానికి కలెక్టర్ బాబు.ఎ నూతన ప్రక్రియను ప్రారంభించారు. సమావేశపు హాలు నుంచి నేరుగా జిల్లాలోని మండలాధికారులతో చర్చించడానికి వీడియోకాన్ఫరెన్స్ విధానాన్ని ఆయన ప్రారంభించారు.
సమావేశంలో ఆర్డీవో రంగయ్య, జెడ్పీ సీఈవో టి దామోదరనాయుడు, డీఎస్‌వో వి రవికిరణ్, మత్స్యశాఖ డీడీ కోటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ డి చంద్రశేఖరరాజు, డీఎంహెచ్‌వో ఆర్ నాగమల్లేశ్వరి, డ్వామా పీడీ మాదవీలత, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, బీసీ సంక్షేమశాఖ డీడీ ఆర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
పరిష్కరించామని చెబితే చాలదు....
– మీకోసంలో ప్రజలు పలు సమస్యలపై ఇచ్చే అర్జీలు పరిష్కరించామని ఆన్‌లైన్‌లో చూపుతున్నారు తప్ప సమస్యల పరిష్కారం కావటం లేదని దీనిపై కలెక్టర్ శ్రద్ధ వహించి అర్జీలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఎండీ సదురుద్దీన్ అర్జీలో కోరారు.
- బందరు మండలం పెదకరగ్రహారం గ్రామం బాబానగర్ కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది, ఆమెకు ప్రభుత్వం నుంచి పరిహారాన్ని, రాయితీలను ఇప్పించాలని, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించాలని దళిత బహుజన పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు నాగేశ్వరరావు అర్జీ ఇచ్చారు.
- బందరు మండలం ఎస్‌ఎన్‌గొల్లపాలెం గ్రామం నుంచి మచిలీపట్నంకు వెళ్లే రహదారిలో ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలని ఎస్‌ఎన్‌గొల్లపాలెం గ్రామసర్పంచ్ అర్జీ ఇచ్చారు.
- బందరుకోటలో ఆర్‌సీఎం సంస్థకు చెందిన శ్మశాన స్థలాన్ని ఇతరులకు అప్పగించరాదని పరాసుపేట హోలీక్రాస్ ఆర్‌సీఎం చర్చి సంఘస్తులు కోరారు.
- కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో అంగన్‌వాడీ భవనాలు నిర్మాణాలను గ్రామానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులు అడ్డుకుంటున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామసర్పంచ్ తమ్ము వెంకటలక్ష్మీ అర్జీ ఇచ్చారు.