
డబుల్ ట్రబుల్
♦ గందరగోళం సృష్టిస్తున్న డబుల్ బెడ్‌రూం పథకం
♦ ఇప్పటివరకు మార్గదర్శకాలివ్వని ప్రభుత్వం
♦ ప్రత్యేక చొరవతో అర్జీలు స్వీకరిస్తున్న యంత్రాంగం
♦ జిల్లాలో లక్షకు పైగా అందిన దరఖాస్తులు
♦ వారం రోజులపాటు కలెక్టరేట్‌కు పోటెత్తిన జనం
♦ మీసేవా కేంద్రాల ద్వారా స్వీకరణకు నిర్ణయం
రెండు పడకగదుల ఇళ్ల పథకం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లా యంత్రాంగం దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. వాటి పరిశీలన అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో అర్జీలను స్వీకరిస్తున్న అధికారులు వాటిని అటకెక్కిస్తున్నారు. వాస్తవానికి దరఖాస్తుల స్వీకరణపైనా సర్కారు సూచనలివ్వనప్పటికీ.. జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవతో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ క్రమంలో అంచనాలకు మించి వేలాదిగా కలెక్టరేట్‌కు తరలివచ్చి దరఖాస్తులిస్తున్నారు. కలెక్టరేట్‌కు వస్తున్న జనతాకిడిని కట్టడి చేసేందుకు తాజాగా మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు జిల్లా యంత్రాంగం ఉపక్రమించింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తుండడం యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 400 చొప్పున జిల్లాకు 5,600 ఇళ్లను మంజూరు చేసింది. తాండూరు, మేడ్చల్ నియోజకవర్గాలకు సీఎం ప్రత్యేక కోటా కింద 1,250 ఇళ్లను కేటాయించారు. ఈక్రమంలో జిల్లాలో 6,850 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈమేరకు గతేడాది దసరారోజున జిల్లా అంతటా భూమిపూజ పూర్తిచేశారు. స్థలాలపై స్పష్టత లేకపోవడం.. నిర్మాణాలకు సంబంధించి టెండర్లు ఖరారు కాకపోవడంతో ఈ పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారయ్యాయి. వాస్తవానికి ఈ ఏడాది దసరాలోగా ప్రభుత్వం నిర్దేశించిన సంఖ్యలో అర్హులకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. నిర్మాణ పనులే మొదలు కాకపోవడంతో దసరా నాటికి ఇళ్ల అప్పగింత జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.
ప్రతిపాదనలతో సరి..
ప్రభుత్వం మంజూరు చేసిన 6,850 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జిల్లాకు మంజూరైన ఇళ్లను నిర్మించేందుకు 102 లేఅవుట్లు చేసేలా ప్రణాళికలు తయారు చేశారు. ఈ లేఅవుట్లను ఏకంగా 195.08 ఎకరాల్లో విశాలమైన విస్తీర్ణంలో నిర్మించేలా ఆ ప్రణాళికల్లో పొందుపర్చారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. వీటిని ఆమోదించిన తర్వాత నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.ట
ఇళ్ల నిర్మాణమెప్పుడో!
యాచారం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు పెద్ద ట్రబుల్ వచ్చి పడింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే మొట్టమొదటగా యాచారం మండలం తక్కళ్లపల్లిలో స్థలం ఎంపిక చేశారు. సర్వే నంబరు 252లో ఐదెకరాల స్థలం గుర్తించి, మొదటగా వందమంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించే విధంగా నిర్ణయించారు. గతేడాది అక్టోబర్ 22న దసరా పండుగ రోజు తక్కళ్లపల్లిలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులకు రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిం చారు. పనులు ప్రారంభించి ఐదు నెలలు గడిచినా నేటికీ అర్హుల ఎంపిక కూడా జరగలేదు. ఎంపిక చేసిన స్థలంలో నిర్మాణాలు కూడా చేపట్టడం లేదు. మొదటగా 100మంది లబ్ధిదారులకు 120 గజాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కనీసం అర్హుల ఎంపిక కూడా చేయకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై మండల హౌసింగ్ ఏఈ కరుణాకర్‌రెడ్డిని సంప్రదించగా పనుల ప్రారంభంపై తనకు ఎటువంటి సమాచారమూ లేదన్నారు.
అధికారుల కసరత్తు..
తాండూరు: పట్టణంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు స్థల సేకరణపై దృష్టిసారించారు. పట్టణానికి 600 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ అదనపు కోటాను సీఎం ప్రత్యేకంగా మంజూరు చేశారు. పట్టణ శివారులోని రాజీవ్ గృహకల్ప (ఆర్‌జీకే)తోపాటు ఎన్‌టీఆర్ కాలనీ సమీపంలో ఇళ్ల నిర్మాణాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాజీవ్ గృహకల్ప సమీపంలోని సర్వే నంబర్ 52, 64తోపాటు ఎన్‌టీఆర్ కాలనీ సమీపంలోని సర్వేనంబర్ 41,44,45 పరిధిలోని సుమారు 15 ఎకరాలను ఎంపిక చేశారు. ఆర్‌జీకే సమీపంలోని 52,64 సర్వేనంబర్లలో మొదటి విడతలో సుమారు 440 ఇళ్లను, ఎన్‌టీఆర్ కాలనీ సమీపంలో రెండో విడతలో 160 ఇళ్లను జీ+2 పద్ధతిలో నిర్మించాలని యోచిస్తున్నారు.
పట్టణంలోని మీ సేవా కేంద్రంలో ఆన్‌లైన్‌లో ఇప్పటి వరకు సుమారు 150 దరఖాస్తులు స్వీకరించారు. ఇటీవలనే గుజరాత్ కన్సల్టెన్సీ ప్రతినిధి అనూప్‌దబే ఆయా స్థలాలను పరిశీలించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను ప్రభుత్వానికి అందజేస్తారని ఆమె చెప్పారు. ఈ ప్రక్రియ అనంతరం ఇళ్ల నిర్మాణాల పనులు మొదలవుతాయన్నారు.
భూ సేకరణ వరకే..
మేడ్చల్: వుండలంలోని యూడారం, సోవూరం, మేడ్చల్‌లలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. యూడారం గ్రావుం లో సర్వే నం.150లోని ఒకటిన్నర ఎకరాల్లో 30 ఇళ్లు, సోవూరం గ్రావుంలోని సర్వే నం.65లోని ఒకటిన్నర ఎకరాల్లో 30 ఇళ్లు, మేడ్చల్‌లోని 642 సర్వే నంబర్‌లో 80 ఇళ్లు నిర్మించడానికి అధికారులు భూ సేకరణ చేసి సర్వం సిద్ధం చేశారు. అయితే మేడ్చల్‌లో ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
మేమే ఎంపిక చేస్తాం..
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం అర్హులైన లబ్ధిదారులను మేమే ఎంపిక చేస్తాం. దరఖాస్తులు ఇచ్చేందుకు ఎవరూ కార్యాలయూలకు రావద్దు. ఎంపిక చేసిన గ్రావూలలో, మేడ్చల్ పట్టణంలోని వార్డుల్లో రెవెన్యూ అధికారులు పర్యటించి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు.
-శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్
స్థలాన్వేషణలో అధికారులు..
ఇబ్రహీంపట్నం: మండలంలో సొంతిల్లు లేని పేదలు గంపెడాశతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఇంకా స్థలాన్వేషణలోనే ఉంది. తమకు ఇళ్లు మంజూరు చేయాలని ఇప్పటికే ప్రజాదర్బార్‌లో కొంతమంది దరఖాస్తులు సమర్పించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను అన్వేషించాలన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంగల్‌పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 242లో పది ఎకరాల స్థలాన్ని, ఎలిమినేడు రెవెన్యూ పరిధిలోని 421 సర్వేనంబర్‌లో 36 గుంటల స్థలాన్ని, ఇబ్రహీంపట్నం రెవెన్యూ పరిధిలోని వినోబాగర్‌లో ఉన్న భూదాన్‌బోర్డుకు చెందిన సర్వేనంబర్ 2లో 5 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు తహసీల్దార్ విజయోందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మార్గనిర్దేశకాలు అందలేదని అయన చెప్పారు.
జవహర్‌నగర్‌వాసుల ఎదురుచూపులు..
జవహర్‌నగర్: కన్న ఊరును వదిలి బతుకుదెరువు వెతుక్కుంటూ పొట్టచేతపట్టుకొని వేలాదిమంది జవహర్‌నగర్ వచ్చారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి దరఖాస్తులు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవహర్‌నగర్‌లో దాదాపు రెండు లక్షలమంది నివసిస్తుండగా 25వేల కుంటుంబాలకు పైగా అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. వారంతా ప్రభుత్వం ఆశలు రేకెత్తించిన రెండుపడకల ఇళ్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు: దేవుజా, తహసీల్దార్
ప్రస్తుతానికి జవహర్‌నరగ్‌లో డబుల్‌బెడ్‌రూంల దరఖాస్తులు తీసుకోవడం లేదు. దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తక్షణమే తప్పకుండా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపడతాం.
స్థలాల ఎంపికకే పరిమితం..
పరిగి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ప్రక్రియ స్థలాలకే ఎంపిక వరకే పరిమితమైంది. మొదటి విడతలో భాగంగా మండలంలోని తుంకలగడ్డ, చిట్యాల్, బసిరెడ్డిపల్లి, నస్కల్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో లే అవుట్ల ప్రిపరేషన్ ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలను పరిశీలించి ఫైనల్ కూడా చేశారు. ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో స్థలాల పరిశీలన తోనే ప్రక్రియ నిలిచిపోయింది.
కాగా గ్రామాలను ఎంపిక చేసింది మొదలు తుంకలగడ్డలో సమస్య తలెత్తుతోంది. అధికారులు ఎంపిక చేసిన స్థలాలు గతంలోనే ప్రభుత్వం తమకు కేటాయించిందని సంచార జాతులకు చెందిన పేదలు పేర్కొంటున్నారు. ఇచ్చిన పట్టాలను మళ్లీ లాక్కోవడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 20 ఇళ్లు మాత్రమే కేటాయించగా ఇప్పటికే మండలంలో 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. పరిగి పంచాయతీకి 20 ఇళ్లు కేటాయించగా ఇప్పటికే 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి.
గ్రామాల ఎంపికతోనే సరి..
చేవెళ్లరూరల్: డబుల్‌బెడ్‌రూం ఇళ్లకోసం మండలంలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి స్థలాల పరిశీలన చేసి వదిలేశారు. మండలానికి 80 ఇళ్లు కేటాయించగా మొదటి విడతలో ప్రభుత్వ స్థలాలు అనుకూలంగా ఉన్న నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వాటిలో కౌకుంట్ల, ఆలూరు, తంగడపల్లి, నాంచేరి గ్రామాలు ఉన్నాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో స్థల పరిశీలన పూర్తయిందని లబ్ధిదారుల ఎంపిక ఇంకా కాలేదని తహసీల్దార్ వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆదేశాలు వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. అయితే మండలానికి వచ్చే ఇళ్లలో ప్రతి గ్రామానికి ఒకటి, రెండు కేటాయించేలా చూడాలనే డిమాండ్ వినిపిస్తోంది. మొదటి విడతలో కొన్ని, రెండో విడతలో కొన్ని అనే పద్ధతి బాగాలేదని ప్రతిపక్ష పార్టీలతోపాటు, సొంత పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ స్థలాల ఎంపిక..
శామీర్‌పేట్: మండలంలో డబుల్ బెడ్‌రూంల కోసం మొద టి విడతగా శామీర్‌పేట్, ఉప్పరిపల్లి, తుర్కపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కలెక్టర్ రఘునందనరావు ఆదేశాల మేరకు అధికారులు పలుమార్లు ప్రభుత్వ స్థలాలను పరిశీలించి ఎంపిక చేశారు. శామీర్‌పేట్‌లో 250, ఉప్పరిపల్లిలో 40, తుర్కపల్లిలో 40 ఇళ్లు మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు. శామీర్‌పేట్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 1284లో 5ఎకరాలు, తుర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 413లో 2 ఎకరాలు, ఉప్పరిపల్లి రెవెన్యూ పరిధిలోని 837 సర్వేనంబర్‌లో 2 ఎకరాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. శామీర్‌పేట్‌లో సుమారు 800పై చిలుకు మంది, తుర్కపల్లిలో 450 మంది, ఉప్పరిపల్లిలో 600 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్..
ఘట్‌కేసర్: మండలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకోసం తహసీల్దారు కార్యాలయానికి ఇప్పటివరకు 1200 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుదారులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మండలానికి సుమారు 500వరకు ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇందుకోసం ఏదులాబాద్, ప్రతాప్‌సింగారం గ్రామాల్లో రెండు ఎకరాల చొప్పున గుర్తించారు. ప్రతాప్‌సింగారంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇప్పటికే భూమిపూజ చేశారు. ఏదులాబాద్‌లోని స్థలాన్ని కలెక్టర్ రఘునందన్‌రావు పరిశీలించారు.
పది ఎకరాల గుర్తింపు..
శంషాబాద్ రూరల్: రెండు పడకల ఇళ్ల నిర్మాణం కోసం శంషాబాద్ మండలంలోని ఊట్‌పల్లి, హమీదుల్లానగర్, మల్కారం, జూకల్, చర్లగూడ గ్రామాల్లో పది ఎకరాలను గుర్తించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు కాగా.. శంషాబాద్ మండలానికి సుమారు 120 ఇళ్లను మంజూరు చేసే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొం టున్నారు. ఇప్పటి వరకు ఏ గ్రామంలో కూడా ఇళ్ల కోసం దరఖాస్తులను స్వీకరించలేదు. ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించిన గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామ సభలో ప్రకటించిన అనంతరం తుది జాబితా రూపొందిస్తామని తహసీల్దార్ వెంకట్‌రెడ్డి తెలిపారు.