
శివమెత్తించిన శివమణి
గుంటూరు : ఉద్దండరాయునిపాలెంలో గురువారం నిర్వహించనున్న అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ రోజు ఉదయం ముందుగా గణపతి హోమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు కళాకారులు తమ నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అతిథులను అలరిస్తున్నారు. డ్రమ్మర్ శివమణి తన బృందంతో సభా వేదికను శివమెత్తించారు.
సభా ప్రాంగణంలో ప్రజల సౌకర్యార్థం 22 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అందరూ వీక్షించేలా ఈ ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు. ప్రజలు స్క్రీన్లపై ప్రధాని సందేశం, శంకుస్థాపన కార్యక్రమం తిలకించేలా ఏర్పాటు చేశారు.
అమరావతి శంకుస్థాపనకు దేశవిదేశాలనుంచి అతిథులు తరలి వస్తున్నారు. ప్రముఖులతో గన్నవరం విమానాశ్రయం కిటకిటలాడుతోంది. గన్నవరం విమానాశ్రయంలో అతిథులకు మంత్రులు స్వాగతం పలికి ప్రత్యేక వాహనాల్లో శంకుస్థాపన ప్రదేశానికి తీసుకువస్తున్నారు. సభా ప్రాంగణానికి అతిథులు, ప్రజలు చేరుకుంటున్నారు.