డీఎస్‌డీఓ టీవీఎల్ సత్యవాణి
-
జిల్లాలో పనిచేయడం సంతోషంగా ఉంది
-
అందరి సహకారంతో క్రీడాభివృద్ధికి కృషి
-
డీఎస్‌డీఓ టీవీఎల్ సత్యవాణి
మహబూబ్‌నగర్ క్రీడలు: ‘జిల్లాకు బదిలీ అయినప్పుడు అదో తెలియని భయం ఉండేది.. మహబూబ్‌నగర్‌లో రాజకీయాలు ఎక్కువని.. ఇక్కడ డీఎస్‌డీఓగా పనిచేయలేనని పలువురు పలురకాలుగా మాట్లాడేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 15రోజుల్లో బదిలీ చేసుకుని వెళ్లాలనుకున్నాను. కానీ నెలరోజుల్లో ఇక్కడి వాతావరణం బాగా నచ్చింది. క్రీడాకారుల్లో ఏదో సాధించాలనే తపన క్రీడా అసోసియేషన్ల సపోర్ట్‌తో జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలన్న లక్ష్యంతో మనసు మార్చుకున్నాను’ అని డీఎస్‌డీఓ టీవీఎల్ సత్యవాణి తన అనుభవాలను చెప్పారు. డీఎస్‌డీఓగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి’ ఆమె కాసేపు మాట్లాడారు. ఆ వివరాల్లో ఆమె మాటల్లోనే..
మాది వరంగల్ జిల్లా. 1993లో నిజామాబాద్‌లో, 1995 నుంచి 2000 వరకు వరంగల్‌లో, 2000 నుంచి 2009 వరకు కరీంనగర్ హ్యాండ్‌బాల్ కోచ్‌గా పనిచేశాను. 2009 నుంచి 2011 వరకు నల్లగొండ ఇన్‌చార్జ్ డీఎస్‌డీఓగా, 2011 నుంచి 2013వరకు మళ్లీ కోచ్‌గా విధులు నిర్వహించాను. ఆ తర్వాత 2013–2015లో కరీంనగర్ డీఎస్‌డీఓగా పనిచేశాను. గతేడాది సెప్టెంబర్‌లో ఇక్కడ డీఎస్‌డీఓగా బాధ్యతలు తీసుకున్నాను.
కలెక్టర్ సహకారంతో క్రీడాభివృద్ధి..
నేను బాధ్యతలు స్వీకరించిన రోజే కలెక్టర్‌ను కలిసి క్రీడాభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని కోరగా ‘గోహెడ్’ అంటూ ఎంతో ప్రోత్సహించారు. గతేడాది ఎస్‌బీఐ సహకారంతో ఆర్‌జీకేఏ టోర్నీలకు వెళ్లే క్రీడాకారులకు క్రీడా దుస్తులతో పాటు బ్యాగులు అందజేశాం. జిల్లాలో నిర్మాణమవుతున్న గ్రీన్‌ఫీల్డ్ స్టేడియాల్లో ఇప్పటికే గద్వాల, కొల్లాపూర్, షాద్‌నగర్‌లలో పనులు పూర్తయ్యాయి. మిగతా ముగింపుదశలో ఉన్నాయి. ఈ ఏడాది వేసవిలో ఆంధ్రాబ్యాంక్ సహకారంతో జిల్లాలో 36ప్రాంతాల్లో సమ్మర్‌క్యాంప్‌లు విజయవంతంగా నిర్వహించాం. రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో జిల్లా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ సహకారంతో ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహించగా.. తొలిసారిగా జిల్లా నుంచి 25మంది విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉంది. మాడ్రనైజేషన్ స్కీం కింద మహబూబ్‌నగర్, జడ్చర్ల, ఆత్మకూర్, అచ్చంపేట, వనపర్తి, నారాయణపేట, గద్వాల స్టేడియాల ఆధునికీకరణకు ఎమ్మెల్యేల సహకారంతో ప్రతిపాదనలు పంపగా మహబూబ్‌నగర్‌కు రూ.2.50 కోట్లు, నారాయణపేటకు రూ.2.65 కోట్లు మంజూరయ్యాయి. భవిష్యత్‌లో ప్రైవేట్ విద్యాసంస్థలు పాపులర్ గేమ్‌లను స్పాన్సర్ చేసేలా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తన 23 ఏళ్ల సర్వీస్ కంటే జిల్లాలో ఏడాది నుంచి పనిచేస్తుండడం సంతోషంగా ఉందని తెలిపారు.