'చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదు'
విశాఖపట్నం : స్విస్ ఛాలెంజ్ విధానం చాలా అభ్యంతరకరమైనదని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. బుధవారం విశాఖపట్నంలో ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ... రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకుని.. విదేశీ ప్రైవేట్ కంపెనీల కన్సార్షియంకు ఇస్తున్నారని ఆరోపించారు. భూములకు సంబంధించి ఎవరెవరితో ఒప్పందాలు చేసుకున్నారో బయటపెట్టాలని టీడీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వెబ్సైట్లలోనూ ఎక్కడా ఒప్పందాల్లోని వివరాలు లేవని ఈఏఎస్ శర్మ గుర్తు చేశారు. ప్రభుత్వానికి కనీసం 51 శాతం ఉంటేనే... స్విజ్ చాలెంజ్ విధానాన్ని ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రభుత్వానికి 51 శాతం లేకుంటే... ఏపీ మౌలిక సదుపాయాల కల్పన చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు.
ఓ వేళ కోర్టు కొట్టేసినా... పరిహారం కింద నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడా ప్రజాహిత చర్యలు కాని... విధానాలు కాని లేవన్నారు. సింగపూర్ కంపెనీలకు ఎలాగోలా లాభాం చేకూర్చే విధానాలే కనిపిస్తున్నాయని ఈఏఎస్ శర్మ తెలిపారు. స్విస్ ఛాలెంజ్కు చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రే నేరుగా సంప్రదింపులు జరపడం సరికాదని ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.