సీమ అభివృద్ధికి కృషి
సీమ అభివృద్ధికి కృషి
Published Sun, Mar 5 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
– వైఎస్‌ఆర్‌సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టరు కేవీ సుబ్బారెడ్డి
ఆదోని టౌన్: తనను గెలిపిస్తే రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్‌ఆర్‌సీపీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అన్నారు. తనకు వచ్చే వేతనాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకే ఖర్చు చేస్తానని చెప్పారు. ఆదోని పట్టణంలో శనివారం పార్టీ శ్రేణులతో కలసి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. అమూల్యమైన ఓటు తనకే వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారం అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను గెలిపిస్తే సీమ అభివృద్ధి కోసం తన ఆస్తుల్లో రూ. పది కోట్లను ఖర్చు పెడతానని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో నిరుద్యోగ యువత, ఉద్యోగుల కోసం గెస్ట్ హౌస్‌లు ఏర్పాటు చేస్తానన్నారు.
సాధారణ రోజుల్లో ఇవి కల్చరల్ సెంటర్లుగా పనిచేస్తాయన్నారు. సీమ వాసి అయిన సీఎం చంద్రబాబు నాయుడు.. రాయలసీమ గురించి ఢిల్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అన్నారు. తల్లి లాంటి సీమ కోసం ప్రాణాలు అర్పించేందుకు కూడా వెనుకాడబోనని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానన్నారు. ఏకీకృత రూల్స్, పీఆర్సీ, డీఎలు, అరియర్స్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
పాఠశాలల్లో బయో మెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పేరుకే ఉద్యోగుల హెల్త్ కార్డులని ఇస్తున్నారని, వర్సిటీల్లో పరిశోధనలు జరగడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో ఆ పార్టీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి, శేషిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవ, బీసీ సెల్‌పట్టణ అధ్యక్షుడు మహేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కల్లుబోతుల సురేష్, మండల కన్వీనరు విశ్వనాథ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement