కేసీఆర్ పాలన ఎమర్జన్సీని తలపిస్తోంది | Emergency rule resembles the KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పాలన ఎమర్జన్సీని తలపిస్తోంది

Published Tue, Jul 5 2016 8:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Emergency rule resembles the KCR

మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి
 
 
ఆత్మకూరు : కేసీఆర్‌పాలన ఎమర్జన్సీని తలపిస్తోందని మాజీఎంపీ, బీజేపీ నాయకులు చందుపట్ల జంగారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయూన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం బీజేపీ మండలఅధ్యక్షుడు గురిజాల శ్రీరామ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం కుటుంబపాలన కొనసాగుతోందని విమర్శించారు. కేసీఆర్ పీఠాన్ని కదిలించాలంటే కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలన్నారు. కేసీఆర్‌ది నిరంకుశపాలన అని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఖాళీఅయినట్లేనని, ఇక కాంగ్రెస్ కనపడడంలేదని ఇదే అదనుగా బీజేపీ ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వణుకు పుట్టించేలా చేయూలన్నారు. అనవసరంగా కేసీఆర్ జిల్లాల ప్రక్రియ మొదలుపెట్టి కొడుకుకో జిల్లా, బిడ్డకో జిల్లా, అల్లుడికోజిల్లా, తనకో జిల్లా అప్పజెప్పనున్నారని అప్పచెప్పారని ఆరోపించారు. బీజేపీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ బిల్లులు, కాంట్రాక్టులకోసం పార్టీ మారిన  పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అవినీతికి వెంపర్లాడుతున్నాడని ఆయనకు బుద్ధి చెప్పేందుకు పరకాల ప్రజలు సిద్ధం కావాలని కోరారు. దేశంలో మోడీపాలన ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని, రైతులకోసం త్వరలోనే ఎరువుల ధరలు తగ్గించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు.

అధికారంలోకి రాకముందు ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఆంద్రావాళ్లకు భగీరథపైపుల కాంట్రాక్టు ఎలా అప్పజెప్పాడని ప్రశ్నించారు. మిషన్‌కాకతీయతో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. డాక్టర్ విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్‌కు మిషన్‌భగీరథ, హరీష్‌రావుకు మిషన్‌కాకతీయ, కవితకు బతుకమ్మ పథకాలు అప్పచెప్పి దోచుకుంటున్నారని ఇక కేసీఆర్ బకాసురుని అవతారమెత్తి అన్నిపార్టీల ఎమ్మెల్యేలను మింగుతున్నాడని ఎద్దేవాచేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రకార్యవర్గసభ్యుడు వంగాల సమ్మిరెడ్డి, జిల్లానాయకులు ముత్యాల శ్రీనివాస్, ఆదిరెడ్డి, వీసం రమణారెడ్డి, దిలీప్‌నాయక్, మాదారపు రతన్‌కుమార్,  కందకట్ల రాజమౌళి , శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement