సదస్సును ప్రారంభిస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు
మాదాపూర్: హైదరాబాద్ నగరంలోని వందల ఏళ్ల నాటి కట్టడాలను చూసి ఇంజనీర్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో శుక్రవారం ఆర్చ్ దక్షిణ్ సదరన్ రీజినల్ కాంపారెన్స్–2016ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంజీ గోపాల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజనీర్లు చేసే ప్రతి పని భావి తరాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు.
సాంకేతికతను ఉపయోగించుకొని మరింత అద్భుతమైన కట్టడాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఐఐఏ జాతీయ అధ్యక్షులు దివ్యకుష్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ పద్మావతి పేర్వారం, ఐఐఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్ మన్నెపల్లి గురురాజ్ తదితరులు హాజరయ్యారు.