తప్పుల ‘అనంత’
- జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అంతులేని తప్పిదాలు
- ఐటీ శాఖ మంత్రి సొంత జిల్లాలో వివరాలు నవీకరించని దుస్థితి
- 2017 సమీపిస్తున్నా... 2011 నాటి బుక్‌లెట్టే గతి
నూతన సాంకేతికత వినియోగంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, అరచేతిలో ఎలాంటి సమాచారానైనా క్షణాల్లో పొందవచ్చునని... పాలకులు, అధికారులు ఒక్కటే గోల పెడుతున్నారు. అయితే వాస్తవానికి ఇది సత్యదూరమని వారు గ్రహించడం లేదు. ఇందుకు అనంతపురము అధికారిక వెబ్‌సైట్‌లో జిల్లా ప్రొఫైల్ (ఠీఠీఠీ.్చn్చn్ట్చpuట్చఝu.జౌఠి.జీn) లోకి తొంగి చూస్తే మనవారి పనితనం తేటతెల్లమైపోతోంది.
సింబాలిక్‌గా కుంభకర్ణుడు
జిల్లాలో అధికారులు మారారు. 2011లో ఇక్కడ పనిచేసిన ఏ ఒక్క అధికారీ ప్రస్తుతం లేడు. అయితే జిల్లా అధికారిక వెబ్‌సైట్ తెరచి అందులోని మొదటి ఆప్షన్‌గా ఉన్న డిస్ట్రక్ట్ ప్రొఫైల్ చూస్తూ... 2011-12 నాటి హ్యాండ్ బుక్ కనిపిస్తుంది. అందులో కలెక్టర్ సోలమన్ ఆరోఖ్య రాజ్ అని ఉంటుంది. వాస్తవానికి మరి కొన్ని రోజుల్లో మనం 2017లో అడుగు పెడుతున్నాం. అయినా 2011 నాటి వివరాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. వెబ్‌సైట్‌లోని కీ కాంటాక్ట్స్లో మూడవ ఆప్షన్‌లో ఉన్న డిపార్ట్‌మెంట్స్ పరిశీలిస్తే మన జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ అని కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న గవర్నమెంట్ ఇనిస్టిట్యూషన్స్‌లోకి వెళఙ్ల బ్యాంక్‌లు, పాఠశాలు తదితర వివరాలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఉదాహరణకు బ్యాంక్ ఫైల్ తెరిస్తే... మండలం అని ఉన్న చోట ఇంకొల్లు, ఒంగోలు అని కనిపిస్తుంది. ఈ విషయాలను గమనించిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు! అదే సమయంలో మాస్టర్‌హెడ్‌లో కుంభకర్ణుడి భావచిత్రం కనిపిస్తుండడంతో అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడలేదులే అంటూ చలోక్తులు విసురుతున్నారు.
వింతలు కాదు...
జిల్లాలో లేని మండలాలు అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇంకొల్లు మండలంలో అనంతపురం ఉన్నట్లుగా చూపుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరం కూడా ముగిసేందుకు కేవలం మూడు నెలల వ్యవధి ఉంది. ఇంకా 2011–12 హాండ్ బుక్ ఉంచడమేమిటి..? అందులో 2013 నుంచి 2014 జనవరి కలెక్టర్‌గా పనిచేసిన సోలమన్ ఆరోఖ్యరాజ్ ఫొటో ఇప్పటికీ చూపించడం ఏమిటి? జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్ కుమార్ ఇక్కడి నుంచి బదిలీ అయిన తరువాత పలువురు వచ్చి వెళ్లారు. అయినా నేటికీ సెంథిల్ కుమార్ పేరు మార్చకపోవడం ఏమిటి? జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. ఇందులో ఇంకొల్లు, ఒంగోలు లేనే లేవు. అవి మన జిల్లా ప్రొఫైల్‌లోకి రావడం ఏమిటి? ఇవన్నీ వింతలు కాదు... జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు నమోదు చేయించిన వివరాలు. ప్రస్తుతం నడుస్తున్న కంప్యూటర్ యుగంలో ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోతోంది. జిల్లాకు చెందిన పలువురు ఇతర దేశాల్లోనూ స్థిరపడ్డారు. వారికి కావాల్సిన అధికారిక సమాచారం కేవలం ఈ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. స్వయంగా ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సొంత జిల్లాకు సంబంధించిన వెబ్‌సైట్ నవీకరించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. నిర్లక్ష్యం.. బాధ్యతారాహిత్యం అనేదానికన్నా... జిల్లా సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు అనేందుకు ఈ వెబ్‌సైట్ అద్దం పడుతోంది.