నిర్లక్ష్యానికి ఫలితం | Excise CI and Inspector transfer in Gudumba case | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి ఫలితం

Published Thu, Jun 1 2017 1:49 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

Excise CI and Inspector  transfer in Gudumba case

గుడుంబా నియంత్రణలో పలువురు అధికారుల ఉదాసీనత
రాష్ట్ర కార్యాలయానికి మానుకోట ఎక్సైజ్‌ సీఐ సరెండర్‌
మరో ఇన్‌స్పెక్టర్‌కు అదనపు బాధ్యతలు
మరికొందరు అధికారులపైనా చర్యలకు రంగం సిద్ధం


సాక్షి, వరంగల్‌: వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఎౖMð్సజ్‌ అధికారులకు ‘గుడుంబా’ దెబ్బ తగులుతోంది. గుడుంబా తయారీ, అమ్మకాల నియంత్రణలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉమ్మడి జిల్లాలోని అధికారులపై ఎక్కువగా ఉంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలను గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఈ పరిస్థితి చాలా తక్కువగా ఉంది. దీనిపై ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారు.

అధికారుల తీరుతోనే..
వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎక్సైజ్‌ అధికారుల తీరుతోనే గుడుంబా నియంత్రణలో విఫలమవుతున్నారని ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించారు. మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని ఎక్సైజ్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే గుడుంబా నియంత్రణ ఆశించిన విధంగా లేదని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. గుడుంబా తయారీ, అమ్మకాలు ఎక్కువగా జరిగే మహబూబాబాద్‌ జిల్లాలోని కొందరు అధికారుల వైఖరి ప్రభుత్వానికి నష్టం చేసేలా ఉందని సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా మహబూబాబాద్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.తిరుపతిపై చర్యలు తీసుకున్నారు.

గుడుంబా నియంత్రణపై పట్టించుకోనట్లుగా వ్యవహరించారనే కారణంతో కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణకు మహబూబాబాద్‌ స్టేషన్‌ అదనపు బాధ్యతలను అప్పగించారు. గుడుంబా నియంత్రణ, బెల్లం అమ్మకాల విషయంలో పట్టించుకోనట్లుగా ఉంటున్న మరికొందరు అధికారులపైనా త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా స్థాయి అధికారిపైనా త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. కేసుల నమోదు, పరిష్కారం, గుడుంబా నియంత్రణ, ఉద్యోగుల విషయంలో ఈ అధికారి వ్యవహరించే తీరుపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందినట్లు సమాచారం. త్వరలోనే ఈ అధికారిపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

ఉదాసీనంగా..
రాష్ట్రంలో ఎక్కడా గుడుంబా ఉండొద్దనే రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండేళ్లుగా ఈ విషయంలో గట్టిగా వ్యవహరిస్తోంది. నాటుసారా, గుడుంబా తయారీ, అమ్మకాలను రూపుమాపడమే లక్ష్యంగా ఎక్సైజ్‌ శాఖ అధికారులు పనిచేశారు. అయితే, ఏడాదిగా ఈ విషయంలో కొంత మెతకగా వ్యవహరించారు. దీంతో గుడుంబా తయారీ, అమ్మకాలు మళ్లీ బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖలో ఉన్నతస్థాయిలో భారీ మార్పులు చేసింది. గుడుంబా నియంత్రణలో కఠినంగా వ్యవహరించిన అధికారులకు మళ్లీ బాధ్యతలు అప్పగించింది. ఇలా ఉన్నతస్థాయిలో మార్పులు చేసినప్పటి నుంచి గుడుంబా నియంత్రణ చర్యలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధికారులు మాత్రం ఇంకా మారడంలేదు. యథావిధిగా గుడుంబా నియంత్రణ విషయంలో ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement