ఫ్యాన్సీ నంబర్లకు బ్రేక్‌! | fancy numbers cut of rto | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ నంబర్లకు బ్రేక్‌!

Published Tue, Jun 27 2017 10:38 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఫ్యాన్సీ నంబర్లకు బ్రేక్‌! - Sakshi

ఫ్యాన్సీ నంబర్లకు బ్రేక్‌!

- కేటాయింపు నిలుపుదలతో వాహనదారుల్లో నిరుత్సాహం
- రవాణాశాఖ ఆదాయానికి గండి

అనంతపురం సెంట్రల్‌ : ఆన్‌లైన్‌ అవుతోందనే కారణంతో ముందుగానే ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలుపుదల చేశారు. దీంతో వాహనదారులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.రవాణాశాఖ అధికారుల అత్యుత్సాహం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది.  మరో వైపు రవాణాశాఖ ఆదాయానికీ గండిపడే అవకాశం ఉంది. ఎంతో ఇష్టంగా వాహనం కొనుగోలు చేసిన వారు అంతే ఇష్టమైన.. నచ్చిన నంబర్‌ కూడా ఉండాలని ఆశ పడుతుంటారు. ఇందుకోసం అదనంగా డబ్బులు చెల్లించి ఫ్యాన్సీ నంబర్‌ను తన వాహనానికి వేయించుకుంటుంటారు. ఇటీవల 9999 నంబర్‌కు ఇద్దరు పోటీ పడ్డారు. చివరకు రూ.1.80 లక్షకు ఆ నంబర్‌ను ఓ కాంట్రాక్టర్‌ దక్కించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వాహన నంబర్‌కు ఇచ్చే ప్రాధాన్యత ఏపాటిదో అర్థమవుతుంది.

    సాధారణ నంబర్లకే ద్విచక్ర వాహనానికి అయితే రూ.2 వేలు, కార్లకు అయితే రూ.5 వేలు చొప్పున చెల్లించాలి. రైజింగ్‌ నంబర్, టోటల్‌ 9, 5 వచ్చే నంబర్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. రూ.లక్షలు వెచ్చించేందుకు కూడా వాహనదారులు వెనుకాడరు. దీంతో పరోక్షంగా రవాణాశాఖకు భారీ ఆదాయం సమకూరుతోంది. అయితే త్వరలో ఆన్‌లైన్‌ అవుతోందనే కారణంతో కొద్దిరోజులుగా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపును తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

దీంతో ఎంతోమోజు పడి వాహనాలు కొనుగోలు చేసుకున్నవారు నిరుత్సాహానికి గురవుతున్నారు. తొలుత డీలర్‌ వద్దే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచించారు. ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నంబర్ల కేటాయించకపోవడంతో కొందరు రవాణాశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఉప రవాణా కమిషనర్‌ సుందర్‌వద్దీని అడగ్గా  ఆన్‌లైన్‌ అవుతోందనే కారణంతో ఆర్టీఏ కార్యాలయంలో నిలుపుదల చేశామన్నారు. అయితే తాత్కాలికంగా సడలించినట్లు పేర్కొన్నారు. వచ్చే గురువారం నుంచి మొత్తం ఆన్‌లైన్‌ అవుతుందని, ప్రతి ఒక్కరూ డీలర్‌ వద్ద ఆన్‌లైన్‌లోనే ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement