పొలం దగ్గరకు వెళ్లిన ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.
మహబూబ్‌నగర్ : పొలం దగ్గరకు వెళ్లిన ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం వంచేశ్వరం గ్రామంలో చోటు చేసుకుంది. వంచేశ్వరం గ్రామానికి చెందిన రాజగిరి మల్లయ్య తన పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను చూసేందుకు వెళ్లాడు.
కాగా, అప్పటికే మొక్కజొన్న చేలో ఉన్న ఎలుగుబంటి రైతుపై ఆకస్మాత్తుగా దాడి చేసింది. ఇది గమనించిన చుట్టుపక్కల ఉన్న రైతులు పెద్దగా కేకలు వేయడంతో బెదిరిపోయిన ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. రైతులు వెంటనే స్పందించి గాయపడిన రైతును అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.