రక్షించడానికి పోతే.. చంపేసింది.. | Man killed in bear attack | Sakshi
Sakshi News home page

రక్షించడానికి పోతే.. చంపేసింది..

Published Mon, Jun 20 2016 7:54 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆ ఎలుగుబంటి కాళ్లకు కంచెఉచ్చు పడడంతో ఆరు గంటలపాటు మృతదేహం వద్దే ఉంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. నల్లమల అటవీ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి అటవీ జంతువులు రాకుండా ఉండేందుకు రైతులు కంచె ఏర్పాటు చే శారు.

 

గ్రామానికి చెందిన బోడ్యానాయక్(50) తన వ్యవసాయ పొలం వద్దకు సోమవారం తెల్లవారుజామున వెళ్లాడు. కంచెలో ఎలుగుబంటి చిక్కుకుంది. అయితే సదరు రైతు దానిని అడవిపంది అనుకొని వెళ్లగొట్టేందుకు దగ్గరికి వెళ్లాడు. ఎలుగుబంటి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. అటు ఎలుగుబంటి, ఇటు రైతు బోడ్యానాయక్ కంచెలో ఇరుక్కుపోయారు. ఎలుగుబంటి దాడిలో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కంచెఉచ్చులో ఇరుక్కుపోయిన ఎలుగుబంటి తప్పించుకోలేకపోయింది. బోడ్యా శరీర భాగాలను చీల్చివేసింది.

అప్పటికే అరుపులను విన్న చుట్టపక్కల రైతులు.. కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కానీ ఎవరూ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. నగరపంచాయతీ కమిషనర్ కె.తులసీరాం అటవీశాఖ, పోలీసు,రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నాగర్‌కర్నూల్ ఆర్‌డీఓ దేవేందర్‌రెడ్డి, అటవీశాఖ డీఎఫ్‌ఓ బాలస్వామి, తహసీల్దార్ ఎం.సుదర్శన్‌రెడ్డి, అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు,ఎస్‌ఐలు అనుదీప్,శ్రీధర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉచ్చులో ఉన్న ఎలుగుబంటిని బయటికి తీయడానికి హైదరాబాద్ జూపార్కుకు సమాచారం ఇచ్చారు.

అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి బయటికి వెళ్లకుండా ఉండేందుకు తాత్కాలిక వలయం ఏర్పాటు చేశారు. జూపార్కు అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఎంఏ హాకీం, అసిస్టెంట్ క్యూరేటర్ శ్రీదేవి, జేఏఓ ఎంఏ గఫార్, ఇంతియాస్, శివ, జిలానీలు వచ్చి ఎలుగుబంటికి బాణంతో మూడు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనులోకి ఎక్కించి హైదరాబాద్ జూపార్కుకు తీసికెళ్లారు. వన్యప్రాణి రక్షణ రిస్క్ టీం వచ్చి బోడ్యానాయక్ మృతదేహాన్ని బయటికి తీశారు. ఎలుగుబంటికి 4 నుంచి 5 ఏళ్ల వయస్సు ఉంటుందని, మగదిగా నిర్ధారించారు. ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరగగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆపరేషన్ పూర్తయ్యింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement