► మద్యం వ్యతిరేక పోరాట ఐక్య వేదిక స్పష్టం
► నూతన ఎక్సైజ్‌పాలసీ రద్దుకు డిమాండ్
► వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): మద్యం మహమ్మారిని సంపూర్ణంగా రూపుమాపే వరకూ తమ పోరు ఆగదని మద్యం వ్యతిరేక పోరాట ఐక్య వేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ పార్కు వద్ద మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. దీనికి ఉపకరించే విధంగా ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టిందన్నారు. తక్షణం ఈ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలకు, హత్యలు పెరగడానికి కారణం ఈ మద్యమేనన్నారు. దీనిని నియంత్రించాల్సిన ప్రభుత్వం దానిని ప్రోత్సహిస్తుండడం దారుణమన్నారు.
ప్రభుత్వం ‘మత్తు’ వదలాలి..
బీర్‌ను హెల్త్ డ్రింక్ మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మున్ముందు మెడిసిన్‌గా ప్రకటిస్తారేమోనని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి ఎద్దేవా చేశారు. మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి, ‘మత్తు’ రాజకీయలకు వ్యతిరేకంగా.. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగానికి, చట్టానికి బద్దులై నడుచుకుంటానని ప్రమాణం చేసి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారు.
మహిళా సమాఖ్య రాష్ట్ర సహయ కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మద్యం బాబులకు అండగా ఉంటున్నారని, గుడి, బడి తేడా లేకుండా బార్‌లు, వైన్ షాపులు ఏర్పాటు చేయడం బాధకరమన్నారు. కార్యక్రమంలో ప్రజాగాయకుడు దేవీశ్రీ ప్రభుత్వం చేస్తున్న మద్యం విధానాలకు వ్యతిరేకంగా పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నగర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీదేవివర్మ, నగర అధికార ప్రతినిధి ధనలత, 19వ వార్డు అధ్యక్షురాలు బొట్టా స్వర్ణ, కొల్లి రమణమ్మ, శిరిషా, శ్రీదేవి, నగర కార్యదర్శి అలివేణి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య బేగం, ప్రగతిశీల మహిళా సంఘం ఎస్. వెంకటలక్ష్మి, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.