‘ఖని’లో ఫైనాన్స్ మాఫియా
-
అవసరానికి అధిక వడ్డీలకు అప్పులు
-
బలవంతంగా అంటగడుతున్న చిట్టీలు
-
కుదేలవుతున్న వ్యాపారుల
గోదావరిఖని : గోదావరిఖనిలో ఫైనాన్స్ దందా జోరుగా సాగుతున్నది. బ్యాంకులు చిరు వ్యాపారులు, మధ్యతరహా వ్యాపారులకు ప్రభుత్వాలు, బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. మాఫియాను తలపించేలా ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రధాన వ్యాపారకేంద్రమైన లక్ష్మీనగర్ మార్కెట్‌లో వ్యాపార అవసరాలకు 8 నుంచి 10 శాతం వడ్డీకి అప్పులు ఇస్తూ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మరికొందరు రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రైవేటుగా చిట్టీలు నిర్వహిస్తూ బలవంతంగా చిట్టీలలో వ్యాపారులను చేరుస్తున్నారు. సమయానికి డబ్బులు చెల్లించని వారి ఆస్తులు జప్తు చేస్తున్నారు.
అవసరాన్ని బట్టి వడ్డీ..
ప్రధాన మార్కెట్ లక్ష్మీనగర్‌లో వ్యాపారం సాగించడానికి డబ్బులు అవసరం కాగా...దీన్ని వడ్డీ వ్యాపారులు అవకాశంగా తీసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. సాధారణంగా 2 శాతం వరకు మార్కెట్‌లో వడ్డీలకు ఇస్తుండగా...సదరు వ్యక్తులు అత్యవసరం పేరుతో లక్ష రూపాయలు ఇచ్చి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వడ్డీ వసూలు చే స్తున్నారు. ఇక డబ్బు అత్యవసరమై బంగారు నగలను కుదవపెట్టి అప్పులు తీసుకున్న వారు ఒకవేళ నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించని పక్షంలో ఆ బంగారు నగలను జప్తు చేసుకుంటున్నారు.
‘చిట్టీల గ్యాంగ్’ హల్‌చల్
పట్టణంలో ఓ వ్యక్తికి కొందమంది వ్యక్తులు అండగా ఉండి ప్రధాన మార్కెట్‌లో అనుమతి లేకుండా చిట్టీ వ్యాపారం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. వీరు ముందుగా ఆ చిట్టీలో ఎంత మంది ఉండాలో నిర్ణయించి ఆయా వ్యాపారులు, వ్యక్తుల పేర్లను రాసుకుని బలవంతంగా చిట్టీ వ్యాపారంలో భాగస్వామ్యులు కావాలని వారికి పుస్తకాలు అంటగడుతున్నారు. ‘రేపటి నుంచి మావోడు వస్తడు...డబ్బులు పంపించండి..మీకు రెండు మూడు నెలల్లో చిట్టీ ఇప్పిస్తాం’ అంటూ హుకుం జారీ చేస్తున్నారు.
కోట్ల రూపాయాల్లో దందా
గోదావరిఖని లక్ష్మీనగర్ మార్కెట్ కేంద్రంగా కోట్ల రూపాయల చిట్టీల దందా సాగుతోంది. ఎలాంటి అనుమతి లేకుండానే రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చిట్టీలను నిర్వహిస్తున్నారు. రూ.15 లక్షల చిట్టీ అయితే 20 నెలల కాలపరిమితిని నిర్ణయించి దుకాణ యజమానుల వద్ద రోజుకు రూ.2,500 చొప్పున నెలకు రూ.75 వేలు వసూలు చేస్తున్నారు. ఇలా మార్కెట్‌లో ప్రైవేటు చిట్టీల వ్యాపారమే సుమారు రూ.5 కోట్ల వరకు నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్, చిట్టీల దందా మాత్రం అక్రమంగా సాగుతున్నా అందరూ మామూలుగానే తీసుకుంటున్నారు. మాఫియాకు అడ్డుకట్ట వేయకుంటే వ్యాపారులు బిచానా ఎత్తేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
– ఓ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చూసిన వ్యక్తి తన ఆసుపత్రిలో పనిచేసేందుకు ఓ వైద్యుడికి అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చేందుకు అప్పులు చేశాడు. అయితే నెల వేతనం ఇవ్వడం కోసం ఆ సమయంలో ఎక్కువ వడ్డీలకు మరింత అప్పులు చేశాడు. ఈ అప్పులను తీర్చేందుకు చిట్టీలు వేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకువచ్చాడు. ఇలా ఆర్థిక భారం అధికం కావడంతో ఐపీ పెట్టాలని అనుకున్నాడు. చివరకు ఫైనాన్స్ నిర్వాహకులు సయోధ్యకు వచ్చినట్లు సమాచారం.
– పట్టణంలో ఓ వ్యక్తి ల్యాబ్ నిర్వహణకు రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు అధిక వడ్డీలు వసూలు చేయడంతో నిర్వహణ కష్టంగా మారింది. చివరకు ఒక ఏడాదిలోనే రూ.15 లక్షల వరకు అప్పులు చే శాడు. ఈ డబ్బులకు బదులుగా ఆ వ్యక్తికి సంబంధించిన భూమిని ఫైనాన్సర్లు తమ పేరుపై రాయించుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ వ్యక్తి ల్యాబ్‌ను మూసివేసి కనిపించకుండాపోయాడు.