ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో మరోసారి ప్రమాదం జరిగింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో మరోసారి ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భవనం పిట్టగోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్కు చెందిన నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయపడిన కార్మికులు రాంగోపాల్, ధర్మేంద్ర, జయరామ్, కిషోర్ చౌదరిలను ఎన్నారై ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఇప్పటికే సచివాలయం నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదాల్లో ఒకరు మృతిచెందారు. తాజా ప్రమాదంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సచివాలయ నిర్మాణంలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై సీపీఎం నాయకుడు బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని...వారికి తక్షణమే నష్టపరిహారమివ్వాలన్నారు. కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోవాలని బాబురావు ప్రభుత్వాన్ని కోరారు.