శ్రీశైలం కిటకిట
-
వరుస సెలవులతో పెరిగిన రద్దీ
-
ఆలయపూజావేళల్లో మార్పులు
-
నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల మహాక్షేత్రం ఆదివారం భక్తులతో పోటెత్తింది. శని, ఆది, సోమవారాలు వరుస సెలవు దినాలు కలిసి రావడంతో లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారు. సుమారు లక్షన్నరకు పైగా భక్తులు స్వామిఅమ్మవార్లను ఆదివారం దర్శించుకుని ఉంటారని అంచనా. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆలయపూజావేళల్లో మార్పులను చేశారు. భక్తుల రద్దీ దృష్టా్య ఉచిత, ప్రత్యేక దర్శన భక్తులకు స్వామివార్ల దూర దర్శనాన్ని ఏర్పాటు చేయగా, సామూహిక అభిషేకాలను నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రం గర్భాలయంలోకి అనుమతించారు. ఉచిత దర్శన క్యూ కంపార్టుమెంట్లు అన్ని నిండిపోవడంతో భక్తులు క్యూ కాంప్లెక్స్ నుంచి రోడ్డుపైనే క్యూ కట్టారు. అక్కడ మొదలైన క్యూ ప్రధాన మాడా వీధిలోని ఆం్ర«ధా బ్యాంక్ వరకు చేరుకుంది. దీనికి తోడు అధిక సంఖ్యలో అభిషేకం టికెట్లను అధికారులు విక్రయించడంతో ఓ వైపు అభిషేక భక్తుల స్పర్శదర్శనాల కోసం క్యూలను నిలిపివేశారు. మరోవైపు ఉచిత,ప్రత్యేక దర్శన క్యూలలోఉన్న భక్తులకు మల్లన్న దర్శన భాగ్యం కలగడానికి సుమారు నాలుగైదు గంటలకు పైగా సమయం పట్టింది.
ముగిసిన కార్తీకమాస శివ దీక్షలు:
కార్తీకమాసం సందర్భంగా మండల, అర్థమండల శివదీక్షలను స్వీకరించిన భక్తులకు ఆదివారం శివదీక్షా విరమణ చేయడంతో కార్తీకమాస శివదీక్షలు ముగిశాయి. దీక్షా విరమణ కోసం రాష్ట్రం నలమూలల నుంచేగాకుండా తెలంగాణా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. స్థానిక శివదీక్షా శిబిరాల వద్ద దీక్షా విరమణ చేసి ఇరుముడులను సమర్పించుకున్నారు. ఇరుముడులతో మొదటగా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఇరుముడులను సమర్పించి పాతాళగంగ స్నానాలు చేసుకున్నారు. శివదీక్షా స్వాములకు ప్రత్యేక దర్శన క్యూ ద్వారా స్వామివార్ల స్పర్శదర్శనాన్ని కల్పించారు.
వసతిగదుల్లేవ్:
శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకోవడానికి శనివారం రాత్రి సమయానికే వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకోవడంతో అన్ని సత్రాలు, దేవస్థానం, టూరిజం, ఆశ్రమాలు, పీఠాలు యాత్రికులతో నిండిపోయాయి.రాత్రి 8 గంటల సమయానికే ఏ సత్రానికి వెళ్లినా వసతిగదులు లేవని బోర్డులు పెట్టేశారు. దేవస్థానం, టూరిజం వసతి గృహాలను ఆన్‌లైన్‌లో గదులను అధిక సంఖ్యలో రిజర్వేషన్ చేసుకున్నారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా వచ్చిన వందలాది మంది భక్తులకు వసతిగదులు లేక ఆయా సత్రాల వరండాలలో సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దీ సోమవారం కూడా కొనసాగే అవకాశం ఉండడంతో దేవస్థానం అధికారులు ఆలయపూజావేళలను ఆదివారం తరహాలో 3.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. కాగా వరుస సెలవు దినాలు వచ్చినప్పుడు శ్రీశైలం ఆన్‌లైన్. కామ్ ద్వారా ముందస్తుగానే గదులు, అభిషేకాది ఆర్జితసేవలను తీసుకోవాలని సూచిస్తున్నారు.