నిధులున్నా నిష్ప్రయోజనం
- రూ.70 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను పట్టించుకోని జేఎన్‌టీయూ అధికారులు
జేఎన్‌టీయూ : కరువు సీమలో కల్పతరువుగా మారిన జేఎన్‌టీయూ(ఎ)కు రూ.70 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నప్పటికీ వాటిని తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు అనుబంధంగా అనంతపురంలో ఏర్పాటైన ఇంజనీరింగ్ కళాశాల 2008లో జేన్‌టీయూ(అనంతపురం) వర్సిటీగా ఏర్పడింది. ఈ సమయంలో 1946 నుంచి 2008 వరకు వచ్చిన కళాశాల ఆదాయం రూ.70 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఈ మొత్తం పూర్తిగా జేఎన్‌టీయూ(అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాల స్తిరాస్థి. అయినప్పటికీ ఈ మొత్తాన్ని దక్కించుకోవడానికి అధికారులు ఇంతవరకూ ప్రయత్నాలు చేయలేదు.
ఆడిటోరియంపై అదపు భారం
అనంతపురంలో జేఎన్‌టీయూ వర్శిటీ ఏర్పడక ముందు ఈ ఇంజనీరింగ్ కళాశాల కార్యకలాపాలన్నీ జేఎన్‌టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిధిలో ఉండేవి. ఏప్రిల్ 2005లో అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలలో ఆడిటోరియం నిర్మాణానికి రూ.4.5 కోట్లు నిధులు మంజూరు చేశారు. 2006లోగా పనులు పూర్తి చేయాలని అప్పట్లో ఇచ్చిన టెండర్లలో షరతు విధించారు. మొదట ఆర్‌సీ భవనాన్ని నిర్మించాలని తలపెట్టారు. ఆధునాతన భవన నిర్మాణానికి అవసరమైన డిజైన్‌ను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. దీని రూపకల్పనలో అంతులేని జాప్యం అనంతరం 2007 నాటికి కొత్త డిజైన్ రూపొందించారు. అప్పటికే భవన నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరగడంతో అదనపు భారం పడింది. దీంతో అధికారులు ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయారు. పనులు మధ్యలో ఆగిపోయాయి.
ఈ క్రమంలో 2008లో ఈ ఇంజనీరింగ్ కళాశాల జేఎన్‌టీయూ(అనంతపురం) వర్సిటీగా ఏర్పాటైంది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలను దీని పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో పరిపాలనాపరమైన అంశాలకు సంబంధించి నిధుల సమస్య తలెత్తింది. ఈ పరిస్థితుల్లో ఆడిటోరియం నిర్మాణం పూర్తి చేయాలని అంచనాలు వేశారు. గతంలో కేటాయించిన రూ.1.87 కోట్లకు అదనంగా మరో రూ.3.19 కోట్లు అవసరమవుతాయని తెలిసి తాత్సారం చేస్తూ వచ్చారు. సకాలంలో పనులు చేపట్టని కారణంగానే అదనపు భారం వచ్చి పడిందని కాగ్ తన నివేదికలో తప్పుబట్టింది. రూ.70 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు తిరిగి ఇవ్వకుండా, ఆడిటోరియానికి నిధులు సకాలంలో విడుదల చేయని కారణంగా మరో రూ.3.19 కోట్లు అదనపు భారం పడింది. ఇప్పటికైనా జేఎన్‌టీయూ (ఏ) ఉన్నతాధికారులు స్పందించి ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసుకురావడంలో సఫలీకృతులు కావాలని విమర్శకులు సూచిస్తున్నారు.