♦ పాతవి పూర్తయితేనే కొత్త పనులు మంజూరు
♦ ‘ఉపాధి’లో లక్ష్యసాధన ఆధారంగా పదోన్నతులు
♦ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘గ్రామీణాభివృద్ధిలో భాగంగా తలపెట్టిన పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి.. మధ్యలో పనులు ఆపితే కొత్తగా పనులు మంజూరు చేసేది లేదు. పురోగతి ఆధారంగానే నిధులు ఇస్తాం.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ధి, అనుబం ధ సంస్థల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, సంజీవరావు, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రాంచంద్రన్ హాజరయ్యారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులపై సమీక్షిస్తూ మంత్రి పైవిధంగా స్పందించారు.
లక్ష్యసాధనతోనే ప్రమోషన్లు..
ఉపాధి హామీ ఉద్యోగులకు ఇకపై పనితీరు, నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగానే పదోన్నతు లిస్తామని మంత్రి చెప్పారు. లక్ష్యసాధనలో వెనకబడితే వారికి పదోన్నతి కష్టమన్నారు. ఉపాధి పని కల్పన కోసం కొత్తగా టోల్‌ఫ్రీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఉపాధిహామీ పథకానికి హరితహారాన్ని జోడిస్తున్నామని, అదే విధంగా ఇంకుడు గుంతలు కూడా ఈ పథ కం కింద తవ్వించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్‌వాడీ, పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతం కావాలని, అసంపూర్తి భవనాలుంటే కొత్తవి మంజూరు చేయబోమన్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో వందశాతం శానిటేషన్ అమలయ్యే లా చూడాలన్నారు. మూడు నెలలకోసారి పం చాయతీరాజ్ రోడ్లు, ఉపాధిహామీ పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తానన్నారు. సమావేశంలో జేసీ ఆమ్రపాలి, డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ హరిత, డీపీఓఅరుణ పాల్గొన్నారు.
ఆ మంత్రి ఎవరు?
అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై సమీక్షలో భాగంగా.. ‘జిల్లాలో అక్రమ లేఅవుట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. వాటిలో నిర్మాణా లు సైతం అదేస్థాయిలో కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టడంలో పంచాయతీ శాఖ నిర్తిప్తత పాటిస్తున్నట్లుంది’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయపడ్డారు. దీంతో జిల్లా పంచాయతీశాఖ అధికారి అరుణ స్పందిస్తూ.. అక్రమ లేఅవుట్లను గుర్తించి వాటిని కూల్చివేసే సందర్భంలో మంత్రి నుంచి ఫోన్లు రావడం.. దాంతో జేసీబీ, ప్రొక్లెయన్లతో వెనుదిరగడం జరిగిందని వివరించారు. ఇంతలో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. జిల్లా మంత్రిగా నేను ఎన్నడూ డీపీఓకు ఫోన్ చేయలేదన్నారు.
తనకు ఫోన్ చేసిన మంత్రి ఎవరో వివరాలు బయటపెట్టాలని నిలదీశారు. అక్రమాలను ఉపేక్షించొద్దని.. వాటిని కూల్చివేయాలన్నారు. ఇంతలో ఆమె మౌనం వహించడంతో అక్కడ కొంత నిశబ్ద వాతావరణం నెలకొంది. వెంటనే మంత్రి జూపల్లి జోక్యం చేసుకుంటూ ఇబ్బందులుంటే జిల్లా మంత్రితో సమావేశమై సమస్యల్ని పరిష్కరించుకోవాలంటూ ఇతర అంశాలపై సమీక్షను కొనసాగించారు. మంత్రి ఫోన్‌తో కూల్చివేతలు నిలిపివేసినట్లు డీపీఓ చెబుతున్న సందర్భంలో మంత్రి మహేందర్‌రెడ్డి కలగజేసుకోవడం.. సభలో అంతర్గత చర్చకు దారితీసింది.