
ఇస్కాన్ పరీక్షలకు స్పందన
అనంతపురం కల్చరల్ : ఇస్కాన్ మందిరం స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరీక్షలకు అనూహ్య స్పందన లభించింది. అనంతపురంతో పాటు ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, కల్యాణదుర్గం తదితర చోట్ల పరీక్షలు నిర్వహించారు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు భక్తివేదాంద శ్రీల ప్రభుపాదుల జీవిత విశేషాలపై సాగిన పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల మంది హాజరైనట్టు ఇస్కాన్ జిల్లా ఇన్‌చార్జి దామోదర గౌరంగదాసు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో 700 మంది, ఇంటల్ ఇంజనీరింగ్ కళాశాలలో 600 మంది ఆధ్యాత్మిక పరీక్షల్లో పాల్గొన్నారు.
మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన కింద ప్రథమ బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తతీయ బహుమతికి రూ.50 వేలు అందిస్తున్నామన్నారు. విజేతలకు త్వరలో విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఇస్కాన్ దక్షిణ భారతదేశ అధ్యక్షుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో రామభద్ర గోవిందు, రాధా గోస్వామి, సుందర చైతన్యదాసు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.