హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం మొదటి దశ కాలువ వెడల్పునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అనంతపురం సెంట్రల్ : హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం మొదటి దశ కాలువ వెడల్పునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు జిల్లా మల్యాల (1500 కిలో మీటర్లు) నుంచి జీడిపల్లి జలాశయం (216 కిలో మీటరు) వరకూ కాలువ వెడల్పునకు రూ. 1272.41 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ప్రతిపాదనలు పంపగా రూ. 1030 కోట్లుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి దశలో 31 ప్యాకేజీ వద్ద 145 కిలో మీటరు అనంతపురం జిల్లా ప్రారంభవుతుంది.
కసాపురానికి సమీపంలోని బుగ్గసంగాల నుంచి జిల్లా మొదలవుతుంది. 134 కిలో మీటర్ల నుంచి 155 వరకూ రూ. 86.53 కోట్లు, 155 నుంచి 176 కిలో మీటరు వరకూ రూ.73.61 కోట్లు, 176 నుంచి 192 కిలో మీటర్లు వరకూ రూ. 54.23 కోట్లు, 192 నుంచి 210 కిలో మీటరు వరకూ రూ. 68 కోట్లు, 210 నుంచి రూ. 216 కిలో మీటరు వరకూ రూ. 34.45 కోట్లు కాలువ వెడల్పు చేసేందుకు నిధులు మంజూరు చేశారు.