హృదయాలను కదిలించే ‘గబ్బిలం’ | gurram jashuva jayanthi today | Sakshi
Sakshi News home page

హృదయాలను కదిలించే ‘గబ్బిలం’

Published Fri, Jul 24 2015 4:06 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

హృదయాలను కదిలించే ‘గబ్బిలం’

హృదయాలను కదిలించే ‘గబ్బిలం’

నవయుగ కవి చక్రవర్తి
మూఢాచారాలపై కవిత్వంతో తిరుగుబాటు
తెలుగు సాహితీ వనంలో పూసిన కవితా సుమం
నేడు గుర్రం జాషువా వర్ధంతి

 
సాక్షి: తెలుగు సాహితీ వనంలో పూసిన కవితా సుమం.. మూఢాచారాలపై తన కవిత్వంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కవితా చైతన్య దీప్తి.. నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితులు గుర్రం జాషువా. ఆధునిక కవుల్లో ప్రముఖస్థానం పొందారాయన. సమకాలీన కవిత్వ ఒరవడి నుంచి మరోవైపు వచ్చి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన సాహిత్య సృష్టికర్తగా ఖ్యాతిగాంచారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని మూఢాచారాలపై పోరు కొనసాగించారు. ఛీత్కారాలు ఎదుర్కొన్నచోటే సత్కారాలు పొందిన మహనీయుడి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మీకోసం..                                                                        

బాల్యం, విద్యాభ్యాసం..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండలో 1895 సెప్టెంబరు 28న వీరయ్య, లింగమ్మ దంపతులకు జాషువా జన్మించారు. తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందిన వారు. మూఢాచారాలతో నిండిన ఆనాటి సమాజంలో చిన్ననాటి నుంచే ఛీత్కారాలు ఎదుర్కొన్నారు జాషువా. చదువుకోవడానికి బడిలో చేరిన తర్వాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుంచి ఎన్నో అవమానాలకు గురయ్యారు. అయితే అగ్ర వర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, జాషువా తిరగబడి వాళ్లను కొట్టేవాడు.

వివాహం, ఉద్యోగం..
1910లో జాషువా మేరీని పెళ్లి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు రూ.3 జీతంతో ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్లి 1915-16లో అక్కడ సినిమా వాచకుడిగా పని చేశారు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథ, సంభాషణలు చదువుతూ పోవడమే ఈ పని. తర్వాత గుంటూరులోని లూథరిన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో టీచర్‌గా పదేళ్లపాటు పని చేశాడు. అనంతరం 1928 నుంచి 1942 వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉన్నారు.
 
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగానూ విధులు నిర్వర్తించాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా వ్యవహరించారు.

సాహితీ సేద్యం..
చిన్ననాటి నుంచే జాషువాలో సృజనాత్మకత ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడేవారు. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నారు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రచించారు.

గబ్బిలంతో విఖ్యాతి..  
1941 నాటి ఆయన రచనల్లో సర్వోత్తమమైనది గబ్బిలం. కాళిదాసు మేఘ సందేశం తరహాలో సాగుతుంది. అయి తే ఇందులో సందేశాన్ని అంట రాని కులానికి చెందిన కథా నా యకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. గుడిలోకి దళితులకు ప్ర వేశం లేదు కానీ గబ్బిలానికి అడ్డు లేదు. కథా నాయకుడి వేదన ను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది. 1932లో వ చ్చిన ఫిరదౌసి మరో ప్రధాన రచన. పర్షియన్ గజినీ మొహమ్మ ద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజు మాటకొక బం గారు నాణెం ఇస్తానని చెప్తాడు. ఆ కవి పదేళ్లు శ్రమించి మహా కావ్యాన్ని రాశాడు. చివరకు అసూయపరుల మాటలు విని రాజు మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఆ కవి హృదయాన్ని ఆ రచనలో అద్భుతంగా వర్ణించారు జాషువా.

రచనల్లో ప్రముఖమైనవి..
మహాత్ముడి మరణ వార్త విని ఆయనకు స్మృత్యంజలిగా 1948లో ‘బాపూజీ’ రచన చేశారు. రుక్మిణీ కల్యాణం, చిదానంద ప్రభాతం, కుశలోపాఖ్యానం, కోకిల, కృష్ణనాడి, సంసార సాగరం, శివాజీ ప్రబంధం, వీరబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత, భారత వీరుడు, 1932లో రాసిన స్వప్నకథ, ముంతాజ్ మహల్, సింధూరం, 1958లో క్రీస్తు చరిత్ర, 1966లో నాగార్జున సాగరం, నా కథ లాంటి రచనలెన్నో ఆయన చేతి నుంచి జాలువారాయి.
 
విశేషాలు..
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ పురస్కారాలను జాషువా అందుకున్నారు.
జాషువా కుమార్తె హేమలతా లవణం జాషువా ఫౌండేషన్ నెలకొల్పారు.
భారతీయ భాషల్లో మానవ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్య కారులకు జాషువా సాహిత్య పురస్కారం అందజేస్తున్నారు.
జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యత్వం లభించింది.
1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement