
చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్ లక్ష్మీనరసింహం
చేనేత కార్మికులను ప్రోత్సహించడంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో చేనేత బజార్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం తెలిపారు. మండలంలోని పెనుబాక, బొద్దాం, రాజాం ప్రాంతాల్లో సుమారు రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చేనేత భవనాల పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. సెప్టెంబర్ నెలాఖరుకు భవన నిర్మాణాలు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
–కలెక్టర్ లక్ష్మీనరసింహం
రాజాం/రాజాంరూరల్: చేనేత కార్మికులను ప్రోత్సహించడంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో చేనేత బజార్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం తెలిపారు. మండలంలోని పెనుబాక, బొద్దాం, రాజాం ప్రాంతాల్లో సుమారు రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చేనేత భవనాల పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. సెప్టెంబర్ నెలాఖరుకు భవన నిర్మాణాలు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం రాజాం మల్లిఖార్జున వీవర్స్ సొసైటీ ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్‌ను పరిశీలించి కార్మికుల స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులను ఆకట్టుకునేలా వస్త్రాలను నేయాలని సూచించారు. భవన నిర్మాణాలు పూర్తయిన తర్వాత వస్త్రాల తయారీలో చేనేత కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. పిల్లలకు యూనిఫారాలు, ఆస్పత్రి బెడ్‌షీట్లు వంటివి స్థానికంగానే తయారు చేసి అందించాలని సూచించారు. అరసవిల్లి దేవస్థానానికి మదుపర్కాలు సరఫరా చేసేందుకు అవకాశం కల్పించాలని పెనుబాక కార్మికులు కోరగా, దేవస్థానంతో ఒప్పందం కుదరదని, సమీపంలో దుకాణం ఏర్పాటుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆప్కో నుంచి రాజాం సొసైటీకి రూ.1.20కోట్లు బకాయి ఉందని, చెల్లింపులకు చొరవ చూపాలని పలువురు కార్మికులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆప్కోతో సంప్రదించి చెల్లింపులకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆప్కో డైరెక్టర్ కాలెపు సత్యారావు, జౌళి శాఖ ఏడీ గుత్తు రాజారావు, ఈఈ సుగుణాకరరావు, డీఈఈ సత్యనారాయణ, ఎంపీడీఓ బి.వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్ కృష్ణమూర్తి, ఏఈ జగదీష్, బనిశెట్టి వెంకటరమణ, జినగం తవిటిరాజు, కనకరాజు, బాణాన విష్ణు, మడ్డు హరి తదితరులు పాల్గొన్నారు.