తిరుమలలో గురువారం మధ్యాహ్నం బోసిపోయిన మాడ వీధులు
వేడి గాలులను అడ్డుకుంటున్న ఆగ్నేయ, దక్షిణ చల్లని గాలులు
సాక్షి, విశాఖపట్నం: వారం రోజుల నుంచి అదేపనిగా ఉడికిస్తున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వడగాడ్పుల నుంచి కాస్త ఊరట చెందనున్నారు. కొన్ని రోజులుగా పశ్చిమ, ఉత్తర దిశల నుంచి వస్తున్న వేడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఆరు డిగ్రీలకు పైగా పగటి(గరిష్ట) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా సముద్రం పైనుంచి వీస్తున్న ఆగ్నేయ, దక్షిణ(చల్లని) గాలులు.. ఉత్తర, పశ్చిమ గాలులను అడ్డుకుంటున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం వారం రోజుల నుంచి కొనసాగిస్తున్న వడగాడ్పుల హెచ్చరికలను గురువారం రెండు రాష్ట్రాల్లోనూ ఉపసంహరించింది. కొద్దిరోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ 'సాక్షి'కి తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇది కూడా కోస్తాలో ఉష్ణ తీవ్రతను కాస్త తగ్గించడానికి దోహదపడుతోంది.
గురువారం నందిగామలో 38, గన్నవరంలో 37, తునిలో 36, విశాఖ, కాకినాడల్లో 35, కర్నూలు, అనంతపురంలలో 41, తిరుపతిలో 40 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ, ఆగ్నేయ గాలులు, ద్రోణి ప్రభావం పాక్షికంగా ఉన్న తెలంగాణలో కోస్తాతో పోల్చుకుంటే ఎండలు అధికంగానే ఉన్నాయి. నిజామాబాద్‌లో 41, రామగుండంలో 40, హైదరాబాద్‌లో 39 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలపై అప్రమత్తత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భానుడి ప్రతాపంతో జనం విలవిలలాడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సంచాలకులు సర్క్యులర్ జారీ చేశారు. ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు మాసాలు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏరోజుకారోజు ప్రతి ఆస్పత్రి నుంచి పరిస్థితిపై నివేదిక హైదరాబాద్‌లోని డెరైక్టర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఇప్పటికే కొన్నిజిల్లాల్లో సెలైన్ బాటిళ్లు, వోఆర్‌ఎస్ ప్యాకెట్ల కొరత ఉన్నట్టు తెలిసింది.