హెచ్‌ఐవీ బాధితులు నిరాశ చెందొద్దు
-డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి
కర్నూలు(హాస్పిటల్): హెచ్‌ఐవీ భారిన పడిన వారు జీవితమైపోయిందని భయపడవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. వ్యాధి నివారణకు మంచి మందులున్నాయన్నారు. జిల్లాలోని ఎయిడ్స్ నివారణ ఒప్పంద ఉద్యోగులు, లెప్రసీ ప్రోగ్రామ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడ్స్ నివారణ స్వచ్చంధ సంస్థల సిబ్బంది ఒకరోజు వేతనాన్ని రూ.లక్ష విరాళంగా ఇస్తూ జిల్లాలోని అన్ని డివిజన్లలోని హెచ్‌ఐవీ బాధిత చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. ప్రతి గర్భిణి తప్పకుండా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతమైన కాన్పు కావాలన్నారు. అప్పుడే మనం జీరో పాజిటివ్‌ను సాధించడానికి వీలవుతుందన్నారు. అడిషనల్ డీఎంహెచ్‌వో(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) డాక్టర్ రూపశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంతో పాటు క్రమం తప్పకుండా ఏఆర్‌టీ మందులు వాడటం వల్ల జీవిత కాలం పెంచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేబార్ కో ఆర్డినేటర్ హేమలత, మెడికల్ ఆఫీసర్ అంకిరెడ్డి, జిల్లా ఎయిడ్స్ నివారణ ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్, ఆరోగ్య విద్య అధికారి ఎస్‌ఎస్ రావు, లెప్రసీ డీపీఎంలు, నేస్తం పాజిటివ్ నెట్‌వర్క్ అధ్యక్షురాలు సుధారాణి, ఎయిడ్స్ నివారణ కౌన్సిలర్లు దస్తగిరి, రసూల్ పాల్గొన్నారు.