పుష్కరాల ముసుగులో దోపిడీ
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మోపిదేవి వెంకట రమణారావు
పెనుమూడి (రేపల్లె) : పుష్కరాల ముసుగులో ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు దోపిడీకి తెగబడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. మండలంలోని పెనుమూడి పుష్కర ఘాట్ పనులను సోమవారం ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడారు. నామినేషన్ పద్ధతిపై పుష్కరాల పనులకు కేటాయించిన వందల రూ. కోట్లు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శించారు. పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమౌతాయో ముందుగానే తెలిసినప్పటికీ పథకం ప్రకారం పనుల కేటాయింపులో తాత్సారం చేసి హడావుడి పనులతో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లపాటు మన్నికగా ఉండాల్సిన పనులను నాణ్యతా లోపాలతో నిర్మించడంతో గోదావరి పుష్కరాల సమయంలో నిర్వహించిన వందల కోట్ల రూపాయల పనులు వృథాగా మారాయన్నారు. బినామీ కాంట్రాక్టర్‌లకు పనులు అప్పగించి కోట్లాది రూపాయలను పాలకపార్టీ నాయకులు అడ్డదారిలో దోపిడీ చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయవచ్చని చెప్పారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు కళ్లు తెరచి పుష్కర పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హితవు పలికారు.