ప్రొద్దుటూరు:
ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి పిల్లలను సరిగా చూసుకోలేదని హింసించేవాడు.. కష్టపడి సంపాదించిన డబ్బంతా తన బంధువులకు ఇచ్చేవాడు.. ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నిస్తే ఉరి వేసి చంపేస్తానని నన్ను హెచ్చరించాడు.. ఈ కారణాల చేత తన భర్త, కుమారుడిని హత మార్చానని ప్రేమ పోలీసులకు తెలిపింది. ఈ నెల 15న గుడ్‌బాయ్ అప్పడాల వ్యాపారి శ్రాంబిక్కల్‌హౌస్ సురేష్, అతని కుమారుడు సుచిలను హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితురాలు ప్రేమను సోమవారం ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను రూరల్ సీఐ ఓబులేసు, ఎస్‌ఐ చిన్నపెద్దయ్యలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెద్ద భార్య చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలు, రెండో భార్య ప్రేమ, ఆమె కుమారుడు సుప్రీమ్‌లతో సురేష్ కోనేటికాల్వ వీధిలో నివాసముంటూ అప్పడాల వ్యాపారం చేసేవాడు. గతంలో మైదుకూరులో ఇదే వ్యాపారం చేస్తున్న అతను, ప్రొద్దుటూరులో ఉంటున్న తన అక్క సుజాత కేరళకు వెళ్లడంతో ఇక్కడికి వచ్చాడు. పెద్ద భార్య పిల్లలైన సుచి, సుమేష్‌లను ప్రేమ సరిగా చూసుకునేది కాదు. ఈ విషయమై భర్త సురేష్ ప్రతి రోజూ ఆమెతో గొడవ పడేవాడు. ఇటీవల కేరళలో ఉంటున్న సురేష్ అక్క కుమార్తె పెళ్లికి డబ్బు అవసరం కాగా అతను ఆ డబ్బును సమకూర్చాడు. దీన్ని జీర్ణించుకోలేని ప్రేమ భర్తతో గొడవ పెట్టుకుంది. ఇందులో తలదూర్చవద్దని భర్త హెచ్చరించడంతో ఆమె అతనిపై పగ పెంచుకుంది. పెద్ద భార్య పిల్లలతో పాటు భర్తను హత మార్చాలని పన్నాగం పన్నింది. ఈ క్రమంలోనే నిద్రపోతున్న వారిపై ఈ నెల 15న ఉదయం కత్తితో దాడి చేయగా సురేష్, సుచిలు మృతి చెందారు. ఈ కేసులో నిందితురాలైన ప్రేమను కెకె స్ట్రీట్‌లోని ఆమె ఇంటి వద్ద సోమవారం అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. ఈ మేరకు ఆమెను రిమాండుకు పంపిస్తున్నామన్నారు.
నన్ను చంపేస్తానన్నాడు.. అందుకే హత్య చేశా
Published Mon, Sep 19 2016 6:02 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM
Advertisement
Advertisement