
'రాజమండ్రిని, గోదావరిని మరువలేను'
కోరుకొండ : రాజమండ్రిని, గోదావరిని తన జీవితంలో ఎన్నడూ మరువలేనని సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. కోరుకొండ మండలం గాదరాడ ఓం శివశక్తి పీఠం దర్శించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. గోదావరి జీవనది అని, ఇక్కడి ప్రజలు అదృష్టవంతులని అన్నారు. గత పుష్కరాల్లో రాజమండ్రిలో పుణ్యస్నానాలు చేశామని, మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం చేస్తానని చెప్పారు.
రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రించిన ‘ప్రేమించు పెళ్ళాడు’ చిత్రంలో తాను హీరోగా చేశానన్నారు. అలాగే, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, పెళ్ళిపుస్తకం, బృందావనం, మీ శ్రేయాభిలాషి, ఆ నలుగురు తదితర అనేక చిత్రాలు ఈ ప్రాంతంలో చేశానన్నారు. మహేష్‌బాబు కథానాయకుడిగా తీసిన శ్రీమంతుడు, నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా తీసిన చిత్రాల్లో ఇటీవల నటించానన్నారు. జూనియర్ ఎన్‌టీఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్‌కు త్వరలో లండన్ వెళ్తున్నానన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఆయన వెంట సినీనటుడు రావి కొండలరావు, ఓం శివశక్తి పీఠం ధర్మకర్త బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు, ఆలయ ఈఓ డి.శర్మ, సీఈఓ వి.దినకర్ తదితరులున్నారు.