
మా కిరీటం రాజేంద్రుడికే!
వివాదాలకు నెలవై, కొద్దివారాలుగా చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ కార్యవర్గ ఎన్నికల్లో సినీ నటుడు రాజేంద్రప్రసాద్, ఆయన ప్యానెల్ ఘనవిజయం సాధించింది. మార్చి 29న ఎన్నికలు జరిగినప్పటికీ, కోర్టు వివాదంతో ఆగిన కౌంటింగ్ న్యాయస్థానం ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం జరిగింది. హైదరాబాద్‌లో ఎ.పి. ఫిల్మ్ చాంబర్ ప్రాంగణంలో ఉత్కంఠభరితంగా 7 రౌండ్లుగా సాగిన ఓట్ల లెక్కింపులో అధ్యక్ష పదవి అభ్యర్థి రాజేంద్రప్రసాద్ ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించారు.
చివరకు సమీప ప్రత్యర్థి జయసుధపై ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ నుంచి ‘మా’ ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా కాదంబరి కిరణ్, ఏడిద శ్రీరావ్‌ు కూడా ఎన్నికయ్యారు. జయసుధ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా తనికెళ్ల భరణి, కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులుగా నటులు సీనియర్ నరేశ్, రఘుబాబు గెలుపొందారు. ‘మా’ ఎన్నికల వ్యవహారంపై కోర్టుకెళ్ళిన నటుడు ఒ.కల్యాణ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడి, తనికెళ్ళ భరణి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక, శివాజీరాజా తోటి నటుడు అలీ కన్నా 36 ఓట్లు ఎక్కువ సాధించి, ప్రధాన కార్యదర్శి అయ్యారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోల్ అయిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్‌కు 237 ఓట్లు రాగా, జయసుధకు 152 ఓట్లు, మూడో అభ్యర్థి ‘బొమ్మరిల్లు’ ఫేవ్‌ు ధూళిపాళకు కేవలం 5 ఓట్లు వచ్చాయి. కాగా, ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్లుగా ఎన్నికైనవారిలో బెనర్జీ, బ్రహ్మాజీ, చార్మి, ఢిల్లీ రాజేశ్వరి, ‘మహర్షి' రాఘవ, శశాంక, గీతాంజలి, హరనాథ్‌బాబు, హేమ, జాకీ, జయలక్ష్మి, కృష్ణుడు, నర్సింగ్‌యాదవ్, పసునూరి శ్రీనివాస్, రాజీవ్ కనకాల, విద్యాసాగర్ గెలుపొందారు.
మొత్తం 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు గాను 16 మంది జయసుధ ప్యానెల్ నుంచి ఇద్దరు రాజేంద్రప్రసాద్ ప్యానెల్ నుంచి విజయం సాధించారు. కాగా, ‘మా’ ఉపాధ్యక్షు లుగా సినీ నటులు శివకృష్ణ, మంచు లక్ష్మి పోలింగ్ కన్నా ముందే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నూతన కార్యవర్గం 2017 వరకు రెండేళ్ళపాటు బాధ్యతలు నిర్వహిస్తుంది.
‘మా’లో మాకు విభేదాలు లేవు - మురళీమోహన్
కాగా, ఇప్పటి వరకు ‘మా’ అధ్యక్షుడిగా వ్యవహరించి, జయసుధ ప్యానెల్‌ను సమర్థించిన నటుడు, పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్, ఎలక్షన్ అధికారి కృష్ణమోహన్‌తో కలసి ఎన్నికల ఫలితాలను మీడియా ముందు ప్రకటించారు. ‘‘పోటీ అనేది ఎన్నికల వరకే. మాలో మాకు విభేదాలు లేవు. అందరం కలసి కూర్చొని, ‘మా’ అభివృద్ధికి కృషి చేస్తాం’’ అని ప్రకటించడం విశేషం.
ప్రతి హామీ నెరవేరుస్తాం
- రాజేంద్రప్రసాద్, ‘మా’ అధ్యక్ష పోటీలో విజేత
‘‘ఈ గెలుపు నాది కాదు. నాకు ఒట్లేసిన వారందరిదీ. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. సినిమా కళాకారులందరూ ఆనందోత్సాహాలతో, నవ్వుతూ బతకాలన్నదే నా కోరిక. అందుకోసం శాయశక్తులా కృషి చేస్తా. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి, అందరినీ కలుపుకొని పనిచేస్తా. అసోసియేషన్ మేలు కోసం పరిశ్రమలోని పెద్దవాళ్ళనూ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ కలుస్తాను. ‘మా’ సభ్యుల్లో అర్హులందరికీ పెన్షన్, ఆరోగ్యబీమా అందేలా చూస్తాం. ‘మా’కు అందమైన గూడు సమకూరేందుకు కృషి చేస్తా.’’