యాదవులను విస్మరిస్తే బుద్ధి చెబుతాం
– అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు
– భారీగా యాదవ శంఖారావ చైతన్య రథయాత్ర ర్యాలీ
కర్నూలు(అర్బన్): దశాబ్దాలుగా రాజకీయ అణచివేతకు గురవుతున్న యాదవులను విస్మరిస్తే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు, ఏపీ బీసీ జేఏసీ చైర్మన్ అన్నా రామచంద్రయాదవ్ అన్నారు. ఈ నెల 14వ తేది నుంచి జిల్లాలో ప్రారంభం అయిన యాదవ శంఖారావ రథయాత్ర శుక్రవారం ఉదయం కర్నూలులోకి చేరుకుంది. ఈ నేపథ్యంలో యాదవ నేతలు స్థానిక బళ్లారి రోడ్డు రేడియో స్టేషన్ నుంచి నంద్యాల రోడ్డు దేవీ ఫంక్షన్ హాల్ వరకు కారు, బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవీ ఫంక్షన్ హాల్‌లో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె. లక్ష్మీనరసింహ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. ప్రజలందరికీ పాలు, పెరుగు, నెయ్యి, మాంసం వంటి మంచి ఆహారాన్ని అందిస్తున్నది యాదవులేనన్నారు.
యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని యాదవులకు కేటాయించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. రాజధాని ప్రాంతంలో 10 ఎకరాల స్థలంలో యాదవ భవనం నిర్మించాలని, పరిశ్రమల స్థాపనకు, డెయిరీల ఏర్పాటు చేసుకునేందుకు యాదవ యువతకు 70 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలన్నారు. యాదవుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సరైన సందర్భంలో బుద్ధి చెబుతామన్నారు. 2019లో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 30 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలు యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు పీజీ నరసింహులు యాదవ్, జేఏసీ అధికార ప్రతినిధి రాజేశ్వరరావు, జేఏసీ కన్వీనర్ టీ శేషఫణి యాదవ్, మిడుతూరు శ్రీనివాసులు, టీడీపీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, అయ్యన్న యాదవ్, దండు శేషు యాదవ్, బీజేపీ మాజీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.