
కొబ్బరి చెట్లకు బీమా అమలు
- ఆరు జిల్లాల్లో అమలుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 2015-16 సంవత్సరానికి కొబ్బరి చెట్ల బీమా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెట్ల వయసు ప్రాతిపదికన తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఈ పథకం అమలవుతుంది.
బీమా వర్తించాలంటే రైతుకు కనీసం ఐదు చెట్లుండాలి. 75 శాతం రాయితీతో ఈ పథకాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెట్టు వయసును బట్టి ప్రీమియం, సమ్ అష్యూర్ చెల్లుంపులు ఉంటాయి.
జీవోలోని కొన్ని ముఖ్యాంశాలు..
- 4 నుంచి 15 వయసున్న చెట్టుకు ఏడాదికి రు. 9 వందల బీమా, 9 రూపాయల ప్రీమియం
- 16 నుంచి 60 ఏళ్ల చెట్టుకు రు. 1750 బీమా, 14 రూపాయల ప్రీమియం
- రైతు చెల్లించాల్సిన ప్రీమియంలో 50 శాతాన్ని కొబ్బరి అభివృద్ధి సంస్థ (సీడీబీ), 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం, 25 శాతాన్ని సాగుదారులు చెల్లిస్తే సరిపోతుంది.
- అంటే 4-15 ఏళ్ల వయసున్న చెట్టుకు రైతు రెండు రూపాయల 25 పైసలు, 16-60 ఏళ్ల మధ్య వయసుండే చెట్టుకైతే మూడున్నర రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
- రెండేళ్లకు, మూడేళ్లకు కూడా బీమా చేయించుకోవచ్చు. అప్పుడు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మరింత తగ్గుతుంది.
- ఆసక్తి ఉన్న రైతులు వచ్చే మార్చి 31లోగా తమ డీడీలను పంపాలి
- ఏఐసీ ఆఫ్ ఇండియా లిమిటెడ్,(అకౌంట్ నెంబర్ 008010200023922) పేరిట హైదరాబాద్‌లో చెల్లుబాటయ్యేలా డీడీతీసి పంపాలి.