
దేశంలో బొబ్బిలి యుద్ధం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఒకప్పుడు పచ్చగడ్డివేస్తే భగ్గుమండే రెండు వర్గాలు కలసి పనిచేయడం సాధ్యమా? నాటకీయంగా అగ్ర నాయకులు కలిసినా వారి అనుచరులు... కార్యకర్తల మనసులు కలుస్తాయా... ఇది అసాధ్యమనే బొబ్బిలి నియోజకవర్గ దేశంలో రాజులు, తెంటు వర్గాలు రుజువు చేస్తున్నాయి. అంతటితో ఆగలేదు సరికదా ఆధిపత్య పోరుకు తెరలేచింది. నిన్నొచ్చి మాపై ఆధిపత్యమేంటని తెంటు వర్గీయులు, ఎప్పుడొచ్చామన్నది కాదు... మా నేత ఎమ్మెల్యేనా కాదా అని రాజుల వర్గీయులు కాలు దువ్వుతున్నారు. వారి మధ్య అగాధం ఎటువైపు దారితీస్తుందో తెలియదుగాని అంతర్గతంగా మాత్రం పరస్పరం తెరచాటు యుద్ధాలు నడుపుతున్నారు.
గడచిన రెండు ఎన్నికలుగా వైరం...
2009 ఎన్నికల్లో బొబ్బిలి రాజైన సుజయకృష్ణ రంగారావు(కాంగ్రెస్) చేతిలో టీడీపీ తరఫున పోటీ చేసిన తెంటు లక్ష్ముంనాయుడు ఓటమి చెందారు. 2014 లోనూ అదే సీన్ రిపీట్ అయింది. అంటే గత రెండు ఎన్నికలుగా వీరి మధ్య రాజకీయ వైరం ఉందన్నది తెలుస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఉన్నా నియోజకవర్గంలో పాలన పెత్తనమంతా తెంటు లక్ష్ముంనాయుడిదే. ఆయన ఏం చెబితే నియోజకవర్గంలో అదే జరిగేది. జన్మభూమి కమిటీలు, అభివృద్ధి పనులు, లబ్ధిదారుల ఎంపిక, ఇతరత్రా నియామకాలు తెంటు సిఫార్సుల మేరకే జరిగాయి. చెప్పాలంటే నియోజకవర్గంలో తెంటుదే పైచేయిగా ఉండేది.
సుజయ చేరికతో మారిన పరిస్థితులు
అధికార వ్యామోహమో, మరేమో తెలియదు గాని అనూహ్యంగా ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరారు. అప్పటినుంచి తెంటు లక్ష్ముంనాయుడికి ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్యే రాకను చివరి వరకు అడ్డుకున్నా పైస్థాయిలో జరిగిన లాబీ యింగ్‌తో తెంటు ప్రయత్నాలు ఫలించలేదు. టీడీపీలో చేరడమే తరువాయి ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే పావులు కదపడం ముమ్మరం చేశారు. పార్టీ కేడర్‌ను తన చేతిలోకి తెచ్చుకునేందుకు అన్ని ఎత్తులూ వేస్తున్నారు.
తెంటుకు ఇదంతా తెలిసినప్పటికీ పార్టీ అధికారంలో ఉండటంతో బయటపడటం లేదు. అధిష్టానం సూచన మేరకు కలిసి ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ, ఈ రెండు వర్గాలు కలవడంలేదు. బొబ్బిలి రాజులు నిర్వహించే సమావేశాలకు తెంటు వర్గీయులు వెళ్లడం లేదు. అంతేనా... తెంటు వర్గీయులను కలిసేందుకు బొబ్బిలి రాజుల వర్గీయులూ ఆసక్తి చూపడం లేదు. వారితో కలిసి పనిచేయలేమంటూ లోపాయికారీగా చెప్పేస్తున్నారు.
నామినేటేడ్ పనులపై రాజుల కన్ను
టీడీపీలో చేరడమే తరువాయి బొబ్బిలి రాజు వర్గీయుల కన్ను అంతకుముందు తెంటు వర్గీయులు దక్కించుకున్న నామినేటెడ్ పనులపై పడింది. రోడ్లు, నీరు చెట్టు పనులు, ఉపాధి పనులు, ఇతరత్రా అభివృద్ధి పనులు తమకివ్వాలని అధికా రులను డిమాండ్ చేస్తున్నారు. గతం లో తెంటు వర్గీయులకు ఇచ్చిన పనులను రద్దు చేసి మరీ తమకివ్వాలని గట్టిగా పట్టుపడుతున్నారు. ఇది అధికారులను ఇరకాటంలో పెడుతోంది. వారు ముందుకెళ్లలేక, వెనక్కి తగ్గ లేక మంజూరు చేసిన పనులను ప్రారంభించకుండా తాత్సారం చేయిస్తున్నారు. చెప్పాలంటే పనులను అడ్డుకుంటున్నారు. దీంతో తమ ప్రాధాన్యత తగ్గిపోయిందని తెంటు వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.
ఇరకాటంలో అధికారులు
గతంలో టీడీపీ నేతలతో వేసిన జన్మభూమి కమిటీలను కూడా మార్చాలని ఎమ్మెల్యే వర్గీయులు కోరుతున్నారు. కమిటీల్లో ఉన్న పాత వారిలో కొందర్ని తప్పించి, తమను వేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వర్గం మార్చాలని, మరో వర్గం మార్చొద్దని ఒత్తిడి చేయడంతో అధికార వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. పోలీసు స్టేషన్లలోనూ ఇదే సీన్ నడుస్తోంది. ఒక ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నప్పుడు ఒక్కో వర్గం ఒక్కో నాయకుడ్ని ఆశ్రయిస్తున్నారు. వారి సిఫారసులతో పోలీసుఅధికారులు తలలుపట్టుకుంటున్నారు.
అక్రమాల గుట్టురట్టు
రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు కాస్తా అక్రమాల గుట్టు విప్పే పనిలో పడింది. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ఫిర్యాదులకు దిగుతున్నారు. ఏకపక్షంగా పనులు చేపట్టడంతో నాసిరకంగా ఉన్నాయని, పెద్ద ఎత్తున నిధులు స్వాహా అయ్యాయని ఆరోపిస్తున్నారు. ఇది అంతర్గత పోరుకు ఆజ్యం పోస్తోంది. ఇదిలా ఉండగా, బొబ్బిలి రాజులతో విభేదిస్తున్న కొందరు నాయకులు త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసి, జరుగుతున్న పరిణామాలపై గళమెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.