నీటి ఎద్దడి ఆ’వరి’ంచె.. | irigation water struggles | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి ఆ’వరి’ంచె..

Published Fri, Feb 3 2017 10:40 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

నీటి ఎద్దడి ఆ’వరి’ంచె.. - Sakshi

నీటి ఎద్దడి ఆ’వరి’ంచె..

భీమ సీమలో పలుచోట్ల పంట విరామం
 సాగు నీరందక డెల్టా రైతుల గగ్గోలు
 పంట వేయకపోతే భూములు చౌడుబారతాయని ఆందోళన
భీమవరం అర్బన్‌ :
సాగునీటి సరఫరాలో వంతులవారీ విధానం అన్నదాతలను కష్టాల పాల్జేస్తోంది. శివారు ప్రాంతాలకు నీరందకపోవడంతో డెల్టా కేంద్రమైన భీమవరం మండలంలోని పలు గ్రామాల్లో వరి చేలు బీడువారాయి. దాళ్వా సీజన్‌ ప్రారంభంలోనూ నీరు లేకపోవడంతో 11 గ్రామాల్లో రైతులు పంట విరామం ప్రకటించారు. కాళీపట్నం, ఎల్‌జీ పాడు, లోసరి, వెంప పంట కాలువల ద్వారా సాగునీరు శివారు ప్రాంతాలకు అందటం లేదు. ఈ కారణంగా వెంప, తుందుర్రు, గూట్లపాడు, లోసరి, గరవళ్లదిబ్బ, బర్రెవానిపేట, ఎల్‌వీఎన్‌పురం, దెయ్యాలతిప్ప, నాగిడిపాలెం, నాగేంద్రపురం, తోకతిప్ప గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో నాట్లు వేయడం మానేశారు. దీనివల్ల 2 వేల ఎకరాలు దాళ్వా పంటకు దూరమయ్యాయి. 
ఆశలన్ని నీరు
సార్వా సీజన్‌లో వర్షాలు, తుపానుల వల్ల పంట చేతికి అందే సమయంలో ముంపుబారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ సీజన్‌లో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు దాళ్వా సాగుపైనే ఆశలు పెట్టుకోవడం పరిపాటి. ఈ ఏడాది శివారు ప్రాంతాలకు ముందుగానే నీటిఎద్దడి తలెత్తడంతో క్రాప్‌ హాలిడే ప్రకటించారు. 
అన«ధికార తూరలతో ఇబ్బందులు
లోసరి, వెంప, కాళీపట్నం, గూట్లపాడు పంట కాలువలను ఆనుకుని కొన్నిచోట్ల చేపలు, రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటికి అధిక మొత్తంలో నీరు అవసరం కావడంతో అనధికార తూములు ఏర్పాటు చేసి తోడేస్తున్నారు. దీంతో పంట కాలువల ద్వారా శివారు ప్రాంతాలకు నీరు వెళ్లడం లేదు. పోనీ.. కనీసం డ్రెయిన్లలోని మురుగు నీటిని చేలల్లోకి మళ్లించి పంటలు పండిద్దామంటే స్లూయిజ్‌ నిర్మాణ పనుల వల్ల వాటిలోకి సైతం నీరు రావడం లేదు. దీంతో వరినాట్లు వేయలేని పరిస్థితి తలెత్తింది. పంట పండించకుండా భూముల్ని ఖాళీగా వదిలేస్తే చేపలు, రొయ్యల చెరువుల వల్ల చౌడుబారిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 
ససూయిజ్‌ నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి
లోసరి గ్రామంలోని మురుగు డ్రెయిన్‌పై స్లూయిజ్‌ నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఆ పనులైనా పూర్తయి ఉంటే మురుగు నీటినైనా వాడుకుని పంట వేసేవాళ్లం. గతంలో నీటి ఎద్దడి వస్తే ఇలానే పంట పండించుకునేవాళ్లం. పంట సాగు చేయకపోతే చేలు ఉప్పు తేలి చౌడుబారిపోతున్నాయి.
 రామాయణం సత్యనారాయణ, రైతు, లోసరి
 
వారవా Ðవరినాట్లు వేయలేదు
నేను ఎకరం పొలంలో వరి పండిస్తున్నాను. గత దాళ్వాలోనూ పంట పండించాం. ఈసారి సాగునీరు రాకపోవడంతో వరి నాట్లు వేయలేదు. పంటను నష్టపోయాం. అధికారులు, ప్రజాప్రతినిధులు మా సమస్యను పరిష్కరించాలి.
 గుద్దటి శ్రీనివాస్, రైతు, లోసరి
 
 
నీరందిస్తాం
లోసరిలో గరువు ఆయకట్టు పరిధిలో లేదు. కొంతమంది రైతులు ఆరుతడి పంటలు పండిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో వంతుల వారి విధానం ద్వారా  ఆ ప్రాంతానికి నీళ్లందిస్తాం. ఎగువ ప్రాంతంలో నీటి వాడకం వల్ల శివారు ప్రాంతాలకు తక్కువగా వస్తుందని ఇరిగేషన్‌ ఏఈ వెంకటేశ్వర్లు చెప్పారు.
 వెంకటేశ్వర్లు, ఏఈ, నీటి పారుదల శాఖ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement