పాస్‌పోర్ట్ ఇక్కడే పొందొచ్చు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
నగరంలో సేవా కేంద్రం ప్రారంభం
న్యూశాయంపేట : వరంగల్ ఉమ్మడి జిల్లా, చుట్టు పక్క జిల్లా వాసులకు పాస్‌పోర్ట్ పొందే అవకాశం ఇక నుంచి సులభతరం కానుంది. ఉమ్మడి జిల్లా, ఖమ్మం తదితర చుట్టు పక్కల ప్రాంతవాసులు పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్ కు వెళ్లకుండా వరంగల్‌లో ఏర్పాటు చేసిన సేవా కేంద్రం ద్వారా పాస్‌పోర్ట్‌ను పొందవచ్చు. విదేశాంగ శాఖ, తపాలా మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాన్ని బుధవారం హన్మకొండ హెడ్‌పోస్టాఫీస్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారుల కృషితో నెలరోజుల్లో ఉగాది సందర్భంగా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పాస్‌పోర్ట్ కోసం జిల్లా వాసులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలో సేవా కేంద్రాన్ని ఏర్పాటుకు కృషి చేశామన్నారు. హెదరాబాద్ తర్వా త వేగంగా వరంగల్ నగరం ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థుల కోసం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడే పక్కా భవనం నిర్మించి ఇస్తామని దానికనుగుణంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధి కారులు చర్యలు తీసుకొని ఇప్పుడు నెలకు వెయ్యి పాస్‌పోర్ట్‌లను తర్వాత కాలంలో మూడు వేలకు పెంచాలని కోరారు.
ఈ సందర్భంగా నెల రోజుల చిన్నారి పులిగిల్ల శ్రేయన్‌కు పాస్ పోర్ట్‌ను కడియం చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతారావు, ఎంపీ దయాకర్, నగర మేయర్ నన్నపనేని నరేందర్, రీజినల్ పాస్‌పోర్డ్ అధికారి డాక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి, చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్, పోస్ట్ మాస్టర్ జనరల్ కల్నల్ ఎలీషా, జెడ్పీ చైర్‌పర్సన్ జి.పద్మ, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజ య్య, అరూరి రమేష్, వి.సతీష్, ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ అమ్రపాలి, సీపీ సుధీర్‌బాబు, సీఎఫ్‌ఓ అక్బర్ పాల్గొన్నారు.
మొదటి రోజు 15 మంది దరఖాస్తు
వరంగల్: హన్మకొండ హెడ్‌పోస్ట్ ఆఫీస్‌లో ఉగాది పర్వదినాన నూతనంగా ప్రారంభమైన పాస్‌పోర్టు కార్యాలయంలో పలువురు నూతన పాస్‌పోర్టుల కోసం, రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజున 15మంది పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఐటీ ఇంచార్జ్ అబ్ధుల్ తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ ఏపీఆర్వోగా పనిచేస్తున్న ఈవీ.కిరణ్మయి తన పాస్‌పోర్టు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.