ప్రభుత్వం మెడలు వంచుదాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి న్యాయమైన డిమాండ్లను సాధించుకుందామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర రావు అన్నారు.
– ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుందాం
– 27న మహా ధర్నా
– జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు
ఆదోని టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి న్యాయమైన డిమాండ్లను సాధించుకుందామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ద్వారాక ఫంక్షన్ హాల్‌లో ఎన్జీవోస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్ రెడ్డి, యాసిన్‌బాషా ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఈ నెల 27న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మహా ధర్నాలో ఉద్యోగులు, కార్మికుల సత్తా ప్రభుత్వానికి చాటాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల క్రితం మొదటి పోరాటంతోనే పీఆర్‌సీ 43 శాతం సాధించుకున్నామన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ పాత విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందని విమర్శించారు. 10 డిమాండ్లతో ఈ నెల 27న ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు. సమావేశంలో జేఏసీ జిల్లా చైర్మన్ వెంగళరెడ్డి, ఉపాధ్యక్షుడు రామకష్ణారెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామశేషయ్య, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి జవహర్‌లాల్, ఎన్జీఓలు నాగరాజు, కిరణ్‌కుమార్, ఉషారాణి, గోపాల్, నాగరాజు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.