జేబులు నింపుకోవడానికే పథకాలు
–వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజం
–పైప్‌లైన్ పైకి లేవడంపై ఎద్దేవా
–సీఎం వస్తున్నారని వీధిన పడిన నిరుపేదలు
సీతానగరం (రాజానగరం): అధికార పార్టీ జేబులు నింపుకోవడానికే ఈ ఎత్తిపోతల పథకాలని, వేలాది కోట్లు కేటాయించి అనుయాయులకు అప్పగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విరుచుకుపడ్డారు. బుధవారం పురుషోత్తపట్నంలో సీఎం చంద్రబాబు వస్తున్నారని నిరుపేదల ఇళ్లను తొలగించడంపై ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెబుతున్న చంద్రబాబుకు ఈ ఎత్తిపోతల పథకాలు ఎందుకని ప్రశ్నించారు. వచ్చే నెలలో ప«థకం నుంచి నీటిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అయితే మరోపక్క వేసిన పైప్‌లైన్‌లు నీటితో పైకి లేచి పోతున్నాయని ఎద్దేవా చేశారు. నాణ్యతా లోపంతో చేస్తున్న పనుల కారణంగానే ఈ విధంగా జరిగిందని ఆరోపించారు.
రైతులను నష్టపర్చుతారా...
తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ నుంచి ఈ నెల 18న ఎమ్మెల్యే చేతుల మీదుగా సాగునీరు విడుదల చేసి, ఒక్క గంటలో నీటి విడుదల ఆపివేశారని విరుచుకుపడ్డారు. టీపీ స్కీమ్‌లో మండలంలో 13,500 ఎకరాల సాగు అవుతుందని, రైతులకు వరినాట్లు వేసే సమయంలో నీటిని నిలిపివేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చల్లమళ్ళ సుజీరాజు, జిల్లా కమిటి కార్యదర్శి వలవల వెంకట్రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొంచ బాబురావు తదితరులు పాల్గొన్నారు.