‘ఎత్తిపోతల’ పేరుతో దోపిడీ
‘ఎత్తిపోతల’ పేరుతో దోపిడీ
Published Fri, Mar 24 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
- వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా
- కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందిన రైతులు అభినందనీయులు
- ప్రభుత్వం కళ్ళు తెరవాలని హితవు
సీతానగరం (రాజానగరం) : ఎత్తిపోతల పథకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో శుక్రవారం పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ప్రభుత్వ పెద్దలు అందినకాడికి వేలాది కోట్లు దోచుకున్నారన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరుతో తిరిగి దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందంటూనే మరోపక్క ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నారని, సీఎం జేబులు నింపుకోవడానికే ఈ పథకాలని ఆరోపించారు. పోలవరం పూర్తయితే ఎత్తిపోతల పథకాలు దేనికని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం పైపులైన్ మార్గంలో భూములు కోల్పొయే రైతులను అధికారులు, ప్రజాప్రతినిధులు భయాందోళనలకు గురి చేసి సంతకాలు చేయించారని విమర్శించారు. కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించి, న్యాయం పొందారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, తద్వారా రైతులు విజయం సాధించారని కొనియాడారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ప్రజలకు, రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందని, అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, ఆ చట్టం ప్రకారం వర్తించాల్సిన అంశాలను అమలు చేయాలని రాజా కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి వలవల రాజా, చళ్ళమళ్ళ సుజీరాజు, జిల్లా కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అంబటి రాజు తదతరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement