సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/మధురపూడి/సీతానగరం: గోదావరిపై ఉన్న ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన ఘనత తనకే దక్కుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్య టనలో భాగంగా మంగళవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ఆయన అనంతరం కోరుకొండ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆవ భూముల్లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో జే–ట్యాక్స్ నడుస్తుంటే రాజానగ రంలో జక్కంపూడి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు.
బ్లేడ్ బ్యాచ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టు కుంటావా జగన్ అని ప్రశ్నించారు. ముని కూడలిలో గతంలో శిరోముండనానికి గురైన యువకుడితో మాట్లాడించారు. పురుషోత్త పట్నం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పురుషోత్తపట్నం ఒక చరిత్రని, రెండులక్షల రైతుల జీవితాన్ని మార్చే ప్రాజెక్టుకు నీళ్లు అందించాలన్న ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. తాను కట్టడం వల్లే దానిని వాడకూడదని జగన్ ఆలోచిస్తున్నాడన్నారు. ప్రజావేదికను కూల్చినట్టు ప్రాజెక్టు కూలిస్తే ఇక్కడి ప్రజలు తాటతీస్తారని హెచ్చరించారు.
పోలవరంపై చేతులెత్తేశారు
రాజమహేంద్రవరంలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మాణమంటున్న సీఎం జగన్ దీనిని నిర్మించలేనని చేతులెత్తేసి, కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తుందని, మనం చేయాల్సిందల్లా ఎలాంటి ఆరోపణలు తప్పులు చేయకుండా, వారి సూచనల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మించడమేనని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన పనుల వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ మొత్తం పోయాయన్నారు.
చేయాల్సిన నాశనంచేసి, ఇప్పుడు కేంద్రమే నిర్మించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణాలు ఎందుకు దెబ్బతిన్నాయనే దానిపై హైదరాబాద్ ఐఐటీ ఒక నివేదిక ఇచ్చిందని తెలిపారు. అందులో 14 కారణాలు చెబితే.. 13 కారణాలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమేనని తేల్చాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment