జనయోధుడు జక్కంపూడి
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సమకాలికునిగా ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన జనయోధుడు జక్కంపూడి రామ్మోహనరా
జయంతి సందర్భంగా పలువురి నివాళి l
జిల్లావ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు
సాక్షి, రాజమహేంద్రవరం:
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సమకాలికునిగా ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన జనయోధుడు జక్కంపూడి రామ్మోహనరావు అని పలువురు నేతలు కొనియాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హైదరాబాద్‌లోని జగన్ స్వగృహంలో జక్కంపూడి 63వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు, ప్రజలకు వెన్నుదన్నుగా అనేక పోరాటాలు చేసిన జక్కంపూడి సేవలు అజరామరమని నేతలు కొనియాడారు.
జక్కంపూడి జయంతిని శనివారం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, జక్కంపూడి అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాజానగరం వృద్ధాశ్రమంలో అన్నసమారాధన నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు జక్కంపూడి జయంతి వేడుకలు నిర్వహించారు. కోరుకొండ, పి.గన్నవరం, మామిడికుదురు, మండపేట, రాజమహేంద్రవరం మండలం తొర్రేడు, కడియం మండలం బుర్రిలంకలో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అమలాపురం నల్ల వంతెన చేరువలోని జక్కంపూడి విగ్రహం వద్ద పార్టీ నేతలు, శ్రేణులు జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లాలో పలుచోట్ల అన్నసమారాధన, రక్తదానం, వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంచారు. ఉద్యమాలే ఊపిరిగా కార్యకర్తల కోసం సైనికుడిలా జీవిత చరమాంకం వరకు పాటుపడిన జక్కంపూడిని నేటి తరం రాజకీయ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం కంబాల చెరువు సెంటర్‌లో జక్కంపూడి నిలువెత్తు విగ్రహానికి ముద్రగడ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్ధి కోసం జక్కంపూడి అహర్నిశలు కష్టపడ్డ యోధుడని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా, పార్టీ నగర కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు భారీ కేకును కట్ చేశారు.
వైద్య శిబిరంలో 2 వేల మందికి పైగా సేవలు
పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో సీతానగరం చినకొండేపూడి సూర్యచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం, రక్తదానం శిబిరం నిర్వహించారు. వైద్యశిబిరంలో పలు విభాగాలలో 40 మంది వైద్యనిపుణులు రెండువేల మందికి పైగా సేవలందించారు. రక్త పరీక్షలు, ఈజీసీ పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందించారు. కాగా వందోసారి రక్తదానం చేసిన సీతానగరం మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు డాక్టర్ బాబును పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, విజయలక్ష్మి, రాజా అభినందించారు. కన్నబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించి, కేక్ కట్ చేశారు. జక్కంపూడి అందించిన స్ఫూర్తితో నడుచుకోవాలన్నారు. సామాన్య కార్యకర్తగా ఉంటూ జిల్లా రాజకీయాలను శాసించిన గొప్పనాయకుడన్నారు.