వేండ్రలో జనతాగ్యారేజ్ పేరుతో సమస్యలపై బ్యానర్ ఏర్పాటు చేసిన దృశ్యం
ఉండి ఎమ్మెల్యే శివరామరాజు వైఖరిపై నిరసన
పాలకోడేరు : మహాప్రభో.. మా ఊరి కన్నీటి గాథలు వినరా?.. అక్రమార్కులకు అండగా నిలుస్తారా?.. ఇచ్చిన హామీలు నెలబెట్టుకోరా? ఇదేనా సంక్షేమ పాలన? అంటూ వేండ్ర గ్రామస్తులు జనతా గ్యారేజీ పేరుతో నిరసన బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు వ్యతిరేకంగా కొంతమంది గ్రామస్తులు ఈ విధంగా నిరసన ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే శివరామరాజు శుక్రవారం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి నిరసనగా కొంతమంది వ్యక్తులు జనతా గ్యారేజ్ పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు.
గ్రామ ప్రజల ఆరాధ్యదైవమైన గుబ్బల మంగమ్మ ఆలయానికి ఎదురుగా మద్యం షాపును ఏర్పాటు చేసి తమ ఖ్యాతేంటో నిరూపించుకున్నారు.. గతంలో పది బస్తాల బియ్యం అక్రమంగా తరలిస్తుండగా రేషన్ డీలర్‌ను పట్టుకుని అధికారులకు అప్పగిస్తే సదరు డీలర్‌పై ఏ విధమైన చర్యలు లేకుండా తిరిగి విధులు అప్పగించారంటూ ఎమ్మెల్యే తీరుపై ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీ అనుమతి లేనిదే అర్హులైన వారికి కార్పొరేషన్ రుణాలు ఇప్పించరా? మీ మనుషులకే ముట్టచెప్పుకుంటారా? అంటూ ప్రశ్నించారు.
వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల పదవులపై, పరిశ్రమల కాలుష్యం, శ్మశానవాటిక ఆక్రమణలు, మంచినీటి సరఫరా తదితర సమస్యలను బ్యానర్లలో ప్రస్తావించారు. బ్యానర్లను చూసి టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించి వెనక్కు తగ్గారు.