
టాటా.. వీడుకోలు..
రంగనాథ్ ఆత్మహత్యతో అభిమానుల ఆవేదన
ఆయన సినీ ప్రస్థానానికి రాజమండ్రిలోనే తొలి అడుగు
రాజమండ్రి : ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య వార్త తెలిసి రాజమండ్రిలోని ఆయన అభిమానులు తీరని ఆవేదనకు గురయ్యారు. మంచి నటుడిని కోల్పోయామని అన్నారు. ఆయన హఠాన్మరణం వెండితెరకు తీరని లోటని గాయకుడు, రంగస్థల, సినీనటుడు జిత్‌మోహన్ మిత్రా పేర్కొన్నారు.
కళలకు కాణాచి అయిన రాజమండ్రియే రంగనాథ్ సినీ ప్రస్థానానికి తొలిమెట్టు అయింది. రాజమండ్రి రైల్వే స్టేషనులో రంగనాథ్ టీటీఈగా పని చేశారు. ‘‘ఆయనను బాపు, రమణలకు మా అన్న శ్రీపాద పట్టాభి పరిచయం చేశారు. బుద్ధిమంతుడు సినిమాలో అక్కినేనిపై చిత్రీకరించిన ‘టాటా.. వీడుకోలు’ పాటలో కనిపించే ఆర్కెస్ట్రా సభ్యుల్లో రంగనాథ్ ఒకరు. ఆ తరువాత రాజమండ్రి నిర్మాతలు నిర్మించిన ‘చందన’ సినిమాలో ఆయన హీరోగా నటించారు.
సినీరంగంలో అడుగు పెట్టాక కూడా ఆయన ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేయలేదు. సినీరంగంలో స్థిరమైన స్థానం లభించాకే ఉద్యోగాన్ని వదులుకున్నారు’’ అని జిత్ గుర్తు చేసుకున్నారు. ‘‘సెక్రటరీ, ఇంటింటి రామాయణం వంటి సినిమాలు రంగనాథ్‌కు మంచిపేరు తీసుకువచ్చాయి. రంగనాథ్ నటుడే కాదు, మంచి రచయిత కూడా. ఆయన కొన్ని నాటకాలు కూడా రాశారు.
బాపు, రమణల భాగవతంలో ఆయన కంసుడిగా నటించారు. ఆయనతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధం ఉంది. తరచూ మా ఇంటికి వచ్చేవారు. రెండు సంవత్సరాలుగా నటీనటులు ఒక్కొక్కరూ వెళ్లిపోవడం అత్యంత బాధాకరం. రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త మరీ ఆవేదన కలిగిస్తోంది’’ అని జిత్ అన్నారు.