
కాపులపై ఆంక్షల కత్తి
రిజర్వేషన్ల సాధన కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్ర ప్రభుత్వం
►పోలీసుల ద్వారా బెదిరింపులు
►కాపు, బలిజ నేతలకు నోటీసులు
►ఇష్టాగోష్టుల పేరిట బుజ్జగించే యత్నాలు
►జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్
నెల్లూరు సెంట్రల్/నెల్లూరు రూరల్ : రిజర్వేషన్ల సాధన కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జిల్లాలోని కాపు, బలిజ నేతలపై ఓ వైపు పోలీసులను ప్రయోగిస్తూ నోటీసులు, కేసుల పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఇష్టాగోష్టుల పేరిట తెరవెనుక నుంచి మంత్రాంగాలు నడిపిస్తోంది. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ సోమవారం ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ‘చావో రేవో.. చలో అమరావతి’ పేరిట ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి పాదయాత్ర చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంపై జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగానే ముద్రగడ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఎలాగైనాసరే పాదయాత్ర జరిపి తీరాలన్న కాపు నేతల వ్యూహాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులు వేడెక్కాయి.
హీటెక్కుతోంది. గద్దెనెక్కిన ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి.. మూడేళ్లు దాటినా ప్రకటనలతో కాలయాపన చేస్తున్నారంటూ చంద్రబాబుపై కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని, చేసిన మోసాన్ని తలచుకుంటున్న కాపు సామాజిక యువత, మహిళలు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా పాదయాత్ర చేస్తామన్న కాపులపై పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్న తీరుపై వారంతా మండిపడుతున్నారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసులంటూ బెదిరింపులు
‘చావో రేవో.. చలో అమరావ తి’ కార్యక్రమానికి మద్దతుగా వెళ్లేందుకు సిద్ధమైన జిల్లాలో ని కాపు, బలిజ నేతలకు బెదిరింపులు తప్పటం లేదు. జిల్లా నుంచి ఏ ఒక్కరు వెళ్లినా నాన్–బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు కాపు నేతలకు నోటీసులు జారీ చేశారు. పాదయాత్రకు వెళ్లటానికి ప్రయత్నించినా.. జిల్లాలో ఎక్కడైనా ఆందోళనలు, నిరసనలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బలిజ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ తేలపల్లి రాఘవయ్య ఆధ్వర్యంలో 500 మంది పాదయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంటిలిజెన్స్ విభాగం ద్వారా ఈ సమాచారం అందుకున్న పోలీసులు రాఘవయ్యతోపాటు ఆయన కుటుంబ సభ్యులకూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కొందరు నేతలపై బైండోవర్ కేసులు పెట్టిన పోలీసులు పాదయాత్రలో పాల్గొనడం చట్టరీత్యా నేరమంటూ నోటీసులు జారీ చేశారు.
జిల్లాలో హైటెన్షన్
ఎట్టిపరిస్థితుల్లో పాదయాత్రకు హాజరు కావాలని కాపు నేతలు నిశ్చయించుకోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రైల్వే స్టేషన్లతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ బలగాలు మోహరించాయి. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాపు నేతలు, యువత ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు కాపులెవరూ ఈ ఉద్యమంలో పాల్గొనకుండా చూడాలంటూ అందిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ సోమవారం జిల్లాలో పర్యటించారు. నగరంలోని ఓ లాడ్జిలో కాపు కార్పొరేషన్ సంక్షేమ, అభివృద్ధి పథకాల సాఫల్యత ఇష్టాగోష్టి పేరుతో కాపు నేతలతో ఆయన సమావేశమై సమాలోచనలు జరిపారు. ముద్రగడ ఉద్యమానికి మద్దతు ఇవ్వవద్దని కోరారు. ఒకవేళ మద్దతు పలికితే కోర్టు కేసులు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు. టీడీపీకి అండగా ఉంటే కాంట్రాక్ట్ పనులను ఇప్పిస్తామని ఆశ చూపారు. దీంతో జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహరావు తదితర నేతలు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
నిలదీసిన నేతలు
కొంతమంది నాయకులు మాట్లాడుతూ జన్మభూమి కమిటీల పెత్తనం వల్ల రుణాల కోసం వేరే కులం వారి కాపులు వద్ద చేతులు కట్టుకోవాల్సి వస్తోందని వాపోయారు. కాపుల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పి సగం నిధులైనా ఇవ్వలేదని.. మిగిలిన వారికి ఎప్పుడు రుణాలిస్తారని రామానుజయను నిలదీశారు. ముద్రగడతోపాటు ఉద్యమంలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, కేసులు నమోదు చేయడం భావ్యం కాదన్నారు.
ఉద్యమంలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. వారిని టీడీపీ సీనియర్ నేత దేశాయిశెట్టి హనుమంతరావు బుజ్జగించే ప్రయత్నం చేశారు. రామానుజయ మాట్లాడుతూ ఉద్యమానికి దూరంగా ఉండాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే.. సామాజిక వర్గానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.