కృష్ణద్వయం..కష్టకాలం
అధికారమే అండగా చెలరేగిపోతే ... ఎవరు అడ్డు వస్తారంటూ అక్రమాలతో చక్రం తిప్పుతుంటే ... తమవారికి మేలు చేయడానికి నమ్మినవాళ్లనే నట్టేటా ముంచేస్తుంటే... సహనం కళ్లు తెరుచుకుంది... నిట్టనిలువునా మునుగుతున్నది తన బతుకేనన్న నిజం తెలుసుకున్నారు ... పిడికిలి బిగించారు ... ఇంకానా ఇకపై సాగదంటూ తిరుగుబావుటా ఎగురవేశారు
-
30 ఏళ్లలో తొలి తిరుగుబాటు
-
అన్యాయం జరిగితే ఎవరినైనా సహించం
-
తనవాళ్లనుకునేవాళ్లనుంచే తిరుగుబాటు
-
కంసులుగా పోల్చి కన్నెర్ర చేసిన తెలుగు తమ్ముళ్లు
-
అయోమయంలో యనమల సోదరులు
అధికారమే అండగా చెలరేగిపోతే ... ఎవరు అడ్డు వస్తారంటూ అక్రమాలతో చక్రం తిప్పుతుంటే ... తమవారికి మేలు చేయడానికి నమ్మినవాళ్లనే నట్టేటా ముంచేస్తుంటే... సహనం కళ్లు తెరుచుకుంది... నిట్టనిలువునా మునుగుతున్నది తన బతుకేనన్న నిజం తెలుసుకున్నారు ... పిడికిలి బిగించారు ... ఇంకానా ఇకపై సాగదంటూ తిరుగుబావుటా ఎగురవేశారు ... కృష్ణులుగా భావించి కొలిస్తే కంసులుగా అవతారమెత్తి మమ్మల్ని హింసిస్తారా అంటూ ధ్వజమెత్తడంతో ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణల ఆటలకు చెక్ పడింది. మందుల పరిశ్రమ పేరుతో తుని నియోజకవర్గంలోని తాటియాకులపాలెంలో పేదల భూమలు కబ్జా చేయడానికి ఉపక్రమించంతో ఈ నిరసన ఘటన ఎదురవుతోంది. వివరాలు ఇలా...
.
సాక్షిప్రతినిధి, కాకినాడ :
మంచి ముసుగులో ఎన్నాళ్లూ రాజకీయాలు నడప లేరు. ‘తన’ అనే పదంతో ఎంత తొక్కిపెట్టి ఉంచినా గూడుకట్టుకున్న వ్యతిరేకత ఎప్పుడో ఒకప్పుడు బద్దలవకమానదు. జిల్లాకు తూర్పున ఉన్న తునిలో ఇప్పుడదే జరుగుతోంది. మూడు దశాబ్థాలపాటు తుని రాజకీయాలను ఒంటిచేత్తో శాసించిన యనమల రామకృష్ణులు 30 ఏళ్లలో తొలిసారి తిరుగుబాటు ఎదుర్కొంటున్నారు. నిన్న, మొన్నటి వరకు తన వెంట తిరిగినవారే తిరగబడి శాపనార్థాలు పెడుతున్నారు. కడుపు మండితే ఎంతటి వారినైనా ధిక్కరిస్తారనేందుకు తుని నియోజకవర్గం తాటియాకులపాలెంలో తిరగ బడ్డ తమ్ముళ్లే తాజా ఉదాహరణ. టీడీపీ ఆవిర్భావం నుంచి మూడు దశాబ్థాలపాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకి తుని నియోజకవర్గం కంచుకోట. అటువంటి కోటకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీటలువారిæవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో బద్దలై ఇప్పుడు పునాదులు కదిలిపోతున్నాయి. ఇంతకాలం రామకృష్ణుల వెన్నంటి నిలిచిన కోనబెల్ట్ గ్రామాలు ఒక్కటొక్కటిగా వారికి దూరమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ ఈ గ్రామాలే రామకృష్ణుడిని గట్టునపడేసేవి. నియోజకవర్గమంతా ఒక ఎత్తు అయితే ఈ గ్రామాల్లోనే ఐదారువేల మెజార్టీతో గెలిచేసేవారు. రామకృష్ణుడు ఇప్పటి వరకు అనేక పదవులు అధిష్టిస్తూ వస్తున్నారంటే పునాది ఆ గ్రామాలేనని నేతలు విశ్లేషిస్తుంటారు. ఆ నియోజకవర్గంలో 1989 నుంచి రామకృష్ణుని మాటకు 30 ఏళ్లపాటు తిరుగులేదు. కోనబెల్ట్ అంటే సుమారు 18వేల పై చిలుకు ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగే అతనికి కంచుకోటగా ఉండేది. ఎన్నికల్లో ఏజంట్ కూడా లేని పరిస్థితి. అంత ఏకపక్షంగా ఓటింగ్ జరిగిపోయేది.
2005 నుంచి బీటలు ప్రారంభం...
2005లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు (తుని మున్సిపాలిటీలో 30 వార్డుల్లో) జెడ్పీటీసీలు, ఎంపీపీలు..ఇలా దాదాపు అన్ని చోట్లా దివంగత వైఎస్ ఛరిష్మాతో యనమల కోటరీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో 30 ఏళ్ల రాజకీయ ప్రస్తానంలో తొలిసారి రామకృష్ణుడు ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అశోక్‌బాబు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచే రామకృష్ణుల రాజకీయ తిరోగమనం మొదలైంది. ఆ ఓటమితో తేరుకోలేక ప్రత్యక్ష ఎన్నికలకే గుడ్‌బై చెప్పేశారు. తన రాజకీయ వారసుడిగా వరుసకు సోదరుడైన కృష్ణుడిని 2014 ఎన్నికల బరిలోకి దింపినా ఓటమే ఆహ్వానించింది. రామకృష్ణుడు కంటే రెట్టింపు ఓట్ల తేడాతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన దాడిశెట్టి రాజా ఓడించారు.
13 గ్రామాలు ఒక్కటై...
తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీలో యనమలకు నూటికి నూరుశాతం వెన్నంటి ఉండే గ్రామం తాటియాకులపాలెం. అటువంటి గ్రామమే రామకృష్ణులపై తాజాగా తిరుగుబాటు జెండా ఎగరేయడానికి వేదికగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. సుమారు 13 గ్రామాలు ఒక్కటై దివీస్ లేబొరేటరీస్‌కు భూ సేకరణ, ఇందుకు సహకరిస్తున్నారంటూ యనమల సోదరులపై తిరుగుబాటుకు నాందిపలికారు. ఆ గ్రామాల నుంచి పిల్లాపాపలతో వందలాది మంది మహిళలు తరలివచ్చి ధిక్కారస్వరాన్ని వినిపించారు. రామకృష్ణులు ఎదురుపడితే పక్కకు తప్పుకున్న ఆ గ్రామస్తులు ఒక్కటై తమ భూములు జోలికొస్తే ఖబడ్ధార్ అంటూ హెచ్చరించారంటే వారిలో ఇన్నేళ్లుగా కూడుగట్టుకున్న ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టుగా స్పష్టమవుతోంది. తాజా వ్యతిరేకతకు భూ సేకరణ అంశం ఒకటే పైకి కన్పిపిస్తున్నా అంతర్లీనంగా రామకృష్ణుల అనుచరుల ఏకపక్ష విధానాలు కూడా తోడవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తునిలో టీడీపీ చిరునామా గల్లంతవుతుందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.