పంచాయతీలుగా గూడేలు
కొమురం భీం వర్ధంతి సభలో కేటీఆర్
♦ ‘జల్ , జంగల్, జమీన్’ స్ఫూర్తితో ముందుకు
♦ మూడేళ్లలో అందరికీ తాగునీరు
♦ ‘వాటర్‌గ్రిడ్’లోనూ ప్రాధాన్యం
♦ జోడేఘాట్‌కు 50 డబుల్ బెడ్రూం ఇళ్లు
♦ పేద గిరిజనులకూ మూడెకరాల సాగు భూమి
సాక్షి, మంచిర్యాల: ‘మీ గూడేల్లో మీ రాజ్యమే (మావనాటే, మావరాజ్) ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన ఆదివాసీ గూడేన్నీ గ్రామ పంచాయతీగా మారుస్తాం. వచ్చే ఎన్నికలను ఆ పం చాయతీల్లోనే నిర్వహిస్తాం’ అని గ్రామీణాభి వృద్ధి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. జల్, జంగల్, జమీన్ కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన పోరాట యోధుడు కొమురం భీం స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడే ఘాట్‌లో కొమురం భీం 75వ వర్ధంతి సభలో, ఆ సందర్భంగా నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్, జోగు రామన్నలతో కలసి కేటీఆర్ పాల్గొన్నారు.
జోడేఘాట్‌లోని గిరిజనులకు సీఎం కోటా కింద 50 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే లా జోడేఘాట్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ‘జల్ నినాదంతో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టే మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలకు శ్రీకారం చుట్టాం. వచ్చే నాలుగేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తాం. వాటర్‌గ్రిడ్ పథకంలో ఆది వాసీ గూడాలకు ప్రాధాన్యం కల్పిస్తాం. జంగల్ నినాదంతో రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడుకునే ప్రయత్నిస్తున్నాం. హరితహారం కింద మొక్కలు నాటుతున్నాం. ఇక జమీన్ నినాదంతో నిరుపేద గిరిజనులకు కూడా వ్యవసాయ యోగ్యమైన మూడెకరాల భూమిని త్వరలో పంపిణీ చేస్తాం’’ అని వివరించారు.
సీఎం దృష్టికి చెల్లప్ప కమిషన్ రద్దు..
చెల్లప్ప కమిషన్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన మరణాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఉట్నూర్‌లో వంద పడకల ఆస్పత్రి, మండల కేంద్రాల్లో 30 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులను ప్రోత్సహించే ందుకు అదనపు వేతనాలు ఇస్తామన్నారు. ‘‘తెలంగాణ పోరాట యోధుల జీవిత చరిత్ర, విజయగాథలు వెలుగులోకి రాకుండా సమైక్య పాలకులు కుట్ర పన్నారు. తెలంగాణ దళిత నాయకుడు వెంకటస్వామి విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై ఆవిష్కరించింది.
దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణ వస్తే ఇక్కడి ప్రజల అస్తిత్వం, ఆత్మ గౌరవం ఆవిష్కృతమవుతుందనడానికి ఈ వర్ధంతి నిదర్శనంగా నిలిచింది’’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపీలు న గేశ్, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.