బుడ్డా రాజశేఖరరెడ్డి
హైదరాబాద్ : కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీని వీడరని, గతంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. తాము పార్టీని వీడుతున్నామంటు మీడియా దుష్ప్రచారం చేసిందని ఆయన శనివారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ...' చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీడియాలో ప్రతిరోజు వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీలో అభద్రతా భావం తీసుకు రావాలని మీడియా ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా టీడీపీ నెరవేర్చగలిగిందా?. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయింది. టీడీపీ చెప్పినట్లు చానల్స్ ఆడటం సరికాదు. మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. దాన్ని నిలుపుకోవాలి' అని అన్నారు.
మాపై ఎందుకు అభాండాలు
పార్టీ మార్పు ప్రచారాన్ని తాము పదేపదే ఖండించామని, తోక పార్టీ మీడియాలు తమపై ఎందుకు అభాండాలు వేస్తున్నాయో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. తమ పేర్లు పెట్టి ఎందుకు మీడియా ప్రచారం చేస్తుందోనని, మీడియా ప్రచారాల వల్ల ప్రజలు తమని నిలదీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటిది ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్లీ ఎందుకు బురద చల్లుతున్నారో తెలియట్లేదన్నారు.
సీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించింది
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తాము కొనసాగుతామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించిందని, ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల వల్లే ఒక్క పనీ కావడం లేదని ఆమె అన్నారు. అమరావతి, ఉత్తరాంధ్ర వైపు చంద్రబాబు దృష్టి పెడుతున్నారని, సీమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.