కార్మిక నేత కన్నుమూత
బీబీ నాయుడుకు ప్రముఖుల నివాళి l
నేడు అంత్యక్రియలు
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కార్మిక ఉద్యమనేత, సీఐటీయూ నాయకుడు బగాది బలుసు నాయుడు (బీబీ నాయుడు ) (69) శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య భారతి, కుమార్తెలు వాణి, రాణి ఉన్నారు. దీర్ఘకాలంగా సుగర్ వ్యాధితో బాధపడుతున్న నాయుడు గురువారం ఉదయం అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండు కిడ్నీలు పని చేయకపోవడంతో ఆయన మృతి చెందారు. ఆయన మృతి కార్మిక ఉద్యమానికి, సీపీఎం పార్టీకి తీరని లోటని సీపీఎం, సీఐటీయూ నాయకులు నివాళులర్పించారు. ఆయన భౌతికకాయానికి శనివారం ఉదయం 10 గంటలకు కోటిలింగాల ఘాట్‌లోని కైలాస భూమిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
నాయుడు పాత్ర కీలకం
కార్మిక ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన కార్మిక నేత బీబీ నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అయోధ్యపురం గ్రామంలో 1948 నవంబరు 9న జన్మించారు.1971లో రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లులో రీవైండింగ్‌లో ట్రైనీ కార్మికునిగా చేరారు. 1973లో సీఐటీయూలో చేరారు. నిబద్ధతతో ఎదిగి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. నాయుడు రాష్ట్రంలోని వివిధ పేపరు మిల్లులను సందర్శించి యూనియన్లు ఏర్పాటు చేసేందుకు చేసిన కృషి ఎనలేనిది. అన్ని యూనియన్ నాయకులను ఏకం చేసి కార్మికోద్యమాలను నిర్వహించి విజయం సాధించారు.
పలువురి సంతాపం
బీబీ నాయుడి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఫోన్ ద్వారా సందేశం పంపగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబూరావు, దడాల సుబ్బారావు, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, అర్బన్ జిల్లా కార్యదర్శి టి.అరుణ్, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం, వివిధ కార్మిక సంఘాల నేతలు ఆనందనగర్ వద్ద గణపతి నగర్‌లోని బీబీ నాయుడు స్వగృహానికి చేరుకుని నివాళులర్పించారు. పేపరు మిల్లు ఎదురుగా ఉన్న సీఐటీయూ కార్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.